వచ్చే వారం విడుదల కాబోతున్న ‘అ ఆ’ సినిమాను ప్రమోట్ చేస్తూ చాల బిజీగా కాలం గడుపుతున్న నితిన్ మీడియాతో మాట్లాడుతూ మాటల మధ్యలో అఖిల్ పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం దీపావళికి విడుదల అయిన ‘అఖిల్’ సినిమా అంత ఘోరపరాజయం చెందుతుందని తాను కలలో కూడ అనుకోలేదు అంటూ ఆ సినిమా ఫ్లాప్ తరువాత దాదాపు 3 నెలలపాటు తనకు సరిగ్గా నిద్ర కూడ పట్టలేదని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు నితిన్.

తన తండ్రి అఖిల్ పరాజయం వల్ల  చాల  డబ్బు నష్టపోవడమే కాకుండా అఖిల్ ను సరిగ్గా లాంచ్ చేయలేకపోయాము అన్న చెడ్డ పేరు తమకు వచ్చింది అని చెపుతూ అసలు ఆ సినిమా అంత ఘోర పరాజయం   చెందడానికి కల కారణాలు తనకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు అని కామెంట్స్ చేసాడు నితిన్. అయితే ఈ ఫెయిల్యూర్ తనను అఖిల్ కు మరింత దగ్గర చేసిందని అంటూ అఖిల్ పై తన అభిమానాన్ని మరొకసారి చాటుకున్నాడు నితిన్. 

సంవత్సరాల పాటు కొనసాగిన తన సినిమాల పరాజయాలు కూడ అఖిల్ ఫెయిల్యూర్ డిస్ట్రబ్ చేసినంతగా తనను బాధ పెట్టలేదు అని కామెంట్స్ చేసిన నితిన్ ను చూస్తూ ఉంటే అఖిల్ ఫెయిల్యూర్ బాధ నాగార్జున కంటే నితిన్ కే ఎక్కువగా ఉందా ? అని అనిపించడం సహజం. ఈ వార్తలు ఇలా ఉండగా నితిన్ తన కెరియర్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడ చేసినట్లు తెలుస్తోంది.

14 ఏళ్ల కెరియర్లో తాను చాలా ఎదురు దెబ్బలు తిన్నానని ఎలాంటి సినిమాలు చేయాలో ఎలాంటివి చేయకూడదో తనకు బాగా తెలిసొచ్చిందని నితిన్ చెపుతూ కొంత భావోద్వేగానికి లోనైనట్లు టాక్. అయితే ‘అ ఆ’ విజయవంతం అయితే ఆ క్రెడిట్ త్రివిక్రమ్ కు చెందుతుందా లేదంటే హీరోగా నితిన్ కు చేరుతుందా అన్నది రానున్న రోజులలో తేలిపోతుంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: