మెగా అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండే ఏకైక వ్యక్తి నాగబాబు అన్నది ఓపెన్ సీక్రెట్. చిరంజీవి తన అభిమానులతో చెప్పదలుచుకున్న మాటలను నాగబాబు ద్వారా షేర్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా చిరంజీవి రామ్ చరణ్ ఆలోచనలను మెగా అభిమానులకు చేరవేసే కీలక పాత్రధారి నాగబాబు. అయితే ఇటువంటి నాగబాబు తనకు మెగా అభిమానులతో ఉన్న సాన్నిహిత్యంతో అప్పుడప్పుడు వారికి చాల ఖచ్చితమైన సలహాలతో పాటు చురకలు కూడ అంటిస్తూ ఉంటాడు. 

ఇప్పుడు నాగబాబు మళ్ళీ రంగంలోకి దిగి మళ్ళీ మెగా అభిమానులకు కొన్ని కీలక సూచనలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిన్న నాగ బాబు మెగా అభిమాన సంఘాల నాయకులతో సమావేశమై వచ్చే నెల ఆగష్టు 22న జరగబోతున్న చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఏ విధంగా నిర్వహించాలి అదేవిధంగా ఆరోజు ఎటువంటి సేవాకార్యక్రమాలు చేపట్టాలి అనే విషయమై మెగా అభిమానులకు అనేక సూచనలు ఇచ్చినట్లు టాక్. 

చిరంజీవి ఇమేజ్ ని పెంచే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలి అని నాగబాబు దిశా నిర్దేశం చేస్తూ ఈ మెగా బ్రదర్ చిరంజీవి వీరాభిమానులకు ఒక సూచనను చాల గట్టిగా ఇచ్చినట్లు టాక్. చిరంజీవి పుట్టినరోజునాడు చేపట్టబోయే కార్యక్రమాలకు మెగా అభిమానులు ఎవ్వరూ తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎటువంటి కార్యక్రమాలు చేయవద్దని డబ్బు ఖర్చుతో పెద్దగా సంబంధం లేకుండా ఉండే సేవా కార్యక్రమాలను చేయాలని నాగబాబు ఒక స్పష్టమైన సూచనను ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

గతంలో కూడ అనేకసార్లు నాగబాబు ఇటువంటి సూచనలు ఇచ్చినా మెగా అభిమానులు అవి ఏమీ పట్టించు కోకుండా చిరంజీవి పట్టినరోజునాడు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అభిమానులచేత తమ సొంత డబ్బు ఖర్చు పెట్టించ కూడదు అన్న ఆలోచన మంచిదే అయినా చిరంజీవి పట్ల విపరీతమైన అభిమానం ఉన్న మెగా అభిమాన సంఘాలు నాగబాబు సలహాలు పాటిస్తాయా అన్నదే ప్రశ్న..   


మరింత సమాచారం తెలుసుకోండి: