ఆ మెగా మెరుపు మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది. మూడు ద‌శాబ్దాల పాటు షేక్ చేసిన ఆ వైబ్రేష‌న్ మ‌ళ్లీ స్టార్ట‌యింది. ఆ కోట్లాది అభిమానుల గుండె చప్పుడు.. ఇప్పుడు విజయధ్వానమై వినిపిస్తోంది. ముప్ఫై ఏళ్ల‌కుపైగా వెండితెరనేలిన మెగా మహారాజు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు అందిస్తోంది ఏపీహెరాల్డ్.  

ఒక వ్య‌క్తి త‌లుచుకుంటే అసాధ్య‌మ‌నేది ఉండ‌దు. కృషి ఉంటే విజ‌య‌పు శిఖ‌రాలపై ఉంటారు అన‌డానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం మెగాస్టార్ చిరంజీవి. చిరుది సాధారణమైన ఇమేజ్ కాదు. అసాధారణమైన విజయాలను ఒంటి చేత్తో సాధించి, తెలుగు సినీ శిఖరాగ్రంపై నిలిచిన అసమాన్యమైన స్వ‌యంకృషి. కోట్లాది మంది అభిమానులకు తెరవేలుపుగా నిలిచిన ఆయన ప్రస్థానం అద్వితీయమైనది. అపూర్వ‌మైన‌ది. ఆయ‌న జీవిత‌మే ఒక సినిమా. పునాదిరాళ్ల నుంచి ఖైదీ నం.150 వ‌ర‌కు మెగాప్ర‌స్థానం కొన‌సాగుతూనే వుంది. 


మూడు ద‌శాబ్దాల పాటు నంబర్ వ‌న్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చిరు సినీ ప‌య‌నం నిజంగా అద్భుత‌మే. ఎవ‌రి అండా లేకుండా, గాడ్ ఫాద‌ర్ లేకుండా సినీ శిఖ‌రంపై నిల‌బ‌డ‌టం మాములు విష‌యం కాదు. సినిమా సినిమాకు మెగా పవర్ మరింతా పెరుగుతూ వచ్చింది. అప్ప‌ట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఘనత సాధించాడు చిరు.


సినీ పునాది..మొగల్తూరులో జన్మించిన చిరు సినీ కెరీర్ 1978లో ప్రారంభమైంది. సరిగ్గా అప్పుడే ఆయన సినీ జీవితానికి పునాది రాళ్ళతో పునాది పడింది. ప్రాణం ఖరీదు విడుదలైన తొలి చిత్రమైంది. అక్కడనుంచి చిరంజీవి కెరీర్ అంచెలంచలుగా ఎదిగింది. 1978 లో శిక్షణాకాలం పూర్తవుతున్న సమయంలో 'పునాది రాళ్ళు' సినిమాలో నటించే ఆవకాశం రావటంతో చిరంజీవి సినీ కెరీర్ స్టార్ట‌యింది. తరవాత వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వినియోగించుకుని కొద్దికాలంలోనే సూప‌ర్ యాక్ట‌ర్ గా, మంచి డాన్సర్ గా పేరు గడించాడు. మొదట నెగిటివ్ పాత్రలలో నటించినా తరవాత హీరోగా రాణించడం మొదలయింది. 1983 లో విడుదల అయిన 'ఖైది ' తెలుగు సినిమా పరిశ్రమకు ఓ పెద్ద స్టార్ నీ ప్రసాదించింది. అదిరిపోయే డాన్సులతో, ఫైట్ లతో వచ్చిన మాస్ ఫాలోయింగ్ తో సుప్రీంహీరోగా తరవాత మెగాస్టార్‌గా కోటానుకోట్ల అభిమానులను సంపాదించుకుని స్టార్ ఇమేజ్ కు కొత్త నిర్వచనం చెప్పాడు చిరు. తరవాత తెలుగు సినిమాలో స్టార్ హీరోగా నిలదొక్కుకోవాలంటే డాన్సు చేయడం, ఫైట్స్ చేయడం అనేవి ప్రధాన అర్హతలు అయ్యాయి. ఇప్పటికి అదే భావనలో తెలుగు ప్రేక్షకులు ఉండటం చూస్తుంటే చిరంజీవి ఎంతలా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవ‌చ్చు. 


మెగా రికార్డులు మెగాస్టార్ అంటే కొత్త విజ‌యాల‌కు కేర‌ఫ్ అడ్ర‌స్. అరుదైన‌ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు చిరు. ఎన్నో చిత్రాలు చేసి మెగాస్టార్ అనే శిఖరానికి చేరుకున్న మెగానటుడు ఆయ‌న‌. చిరంజీవి నెలకొల్పిన రికార్డులన్నీ కలిపితే అదొక రికార్డు. చేసిన‌వి మొత్తం 149 సినిమాలు.. అందులో 100కు పైగా కమర్షియల్ హిట్లు. 30 కి పైగా బ్లాక్ బస్టర్ లు. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌లు ఎన్నో ఎన్నెన్నో. అప్పటివరకు చిరంజీవి చేయని ఓ ఫ్యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌తో వచ్చిన ఇంద్ర సినిమా చిరు స్టామినాను చాటిచెప్పింది. ఠాగూర్‌, అంజి, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌, జై చిరంజీవ, స్టాలిన్‌.. శంకర్‌దాదా జిందాబాద్‌.. చిరు కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళు. 2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత కెరీర్ కు బ్రేక్ వేశారు చిరు.


సేవా కార్య‌క్ర‌మాలుచిరంజీవి ఒక వ్యక్తిలా కాదు ఒక వ్యవస్థగా మారాడు. ప్రజా శ్రేయసే లక్ష్యంగా ముందుకు సాగాడు. పేద ప్రజలు కోసం బ్లడ్‌ బ్యాంకును, ఐ బ్యాంక్‌ను స్థాపించాడు. మదర్‌ తెరిస్సా స్పూర్తితో సేవా మార్గాన్ని ఎనుకున్నారు. ఆచరించారు. 


పొలిటిక‌ల్ ఎపిసోడ్చిరు పుస్త‌కంలో పొలిటిక‌ల్ చాప్ట‌ర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింద‌ని చెప్పుకోవ‌చ్చు. ముప్పై ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగిన చిరంజీవి 2008లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాడు. కానీ చిరు రాజకీయాల్లోకి వెళ్ల‌డం ఆయ‌న అభిమానుల‌కు కూడా న‌చ్చ‌లేదు. ప్ర‌జారాజ్యం పార్టీ ఫ్లాప్ అయింది. ఆ పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేశారు. ముందుగా ఎమ్మెల్యేగా గెలిచిన చిరు, ఆ త‌ర్వాత కాంగ్రెస్ త‌రుపున రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఎంపిక‌య్యారు. రాజ‌కీయాల‌కంటే సినిమాలే బెస్ట్ అని గ్ర‌హించిన చిరు మ‌ళ్లీ మెగాఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 149 సినిమాలు చేసిన చిరు.. ఇప్పుడు 150వ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. 


మెగాస్టార్...బాస్ ఈజ్ బ్యాక్'స్టార్.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ' చిరు మెస్మరైజ్ చేశాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న చిరంజీవి 150వ చిత్రం టీజర్ విడుదలైంది. చిరు తనయుడు రాంచరణ్ తన ఫేస్ బుక్ ద్వారా టీజర్ ను రిలీజ్ చేశాడు. టీజర్ లో చిత్రం షూటింగ్ దృశ్యాలు పొందుపరిచారు. చివరిలో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి కనిపించారు. సోమవారం చిరు 61వ పుట్టిన రోజు సందర్భంగా దీనిని విడుదల చేశారు. తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ విడుదల కావడంతో చిరంజీవి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: