అభిమానం హ‌ద్దులు మీరుతోంది. స్టార్ హీరోల‌ అభిమానులు చెల‌రేగిపోతున్నారు. హీరోలు బాగానే వుంటారు. ఫ్యాన్స్ మ‌ధ్యే ఈ చిచ్చు ఎందుకు? ప‌్రాణాలు తీసుకునేంత ప‌గ‌లు, ప్ర‌తికారాలు దేనికి? అభిమానుల మ‌ధ్య జ‌రుగుతున్న ర‌క్త చ‌రిత్ర‌కు కార‌ణం ఎవ‌రు? రీసెంట్‌గా తిరుపతికి చెందిన వినోద్‌ రాయల్ అనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని దారుణ హ‌త్య‌కు గురికావ‌డం మ‌రింతా ఆందోళ‌న క‌లిగిస్తోంది. అభిమానం ఎటు దారి తీస్తోందో ? వాటిని ఎలా కంట్రోల్ చేయాలో స‌ద‌రు హీరోల‌కు తెలియదా..?

Image result for tollywood heros fans

కేక‌లు, కేరింతలు, చిన్నపాటి తగాదాలు.. ఇవన్నీ స్టార్ హీరో సినిమా రిలీజ్ టైమ్ లో కామన్‌గా కనిపించేవే. చిలికి చిలికి గాలివానలా ఒక్కోసారి ఇవే ఫ్యాన్స్ మధ్య భారీ తగాదాలను సృష్టిస్తున్నాయి. దానికి అనుకోకుండా ఒక్కోసారి హీరోలు.. సాంకేతిక వర్గాలవారు ఇచ్చే స్టేట్‌మెంట్స్ కూడా కారణమైపోతుంటాయి. వారు మాట్లాడిన మాటల్లోని విపరీత అర్థాలను వెతుక్కోవడం వలనే ఇలాంటి అనర్థాలు రెట్టింపై కూర్చుంటాయి.మా హీరో గొప్పవాడు.. కాదు మాహీరోనే గ్రేట్‌.. అని ఇద్దరు ఫ్యాన్స్ మ‌ధ్య వాద‌న మొద‌లైంది. ఆ వాదన కాస్తా చినికిచినికి గాలివానై ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిని కత్తితో పొడిచాడు. దీంతో అతడు కుప్ప‌కూలాడు. అభిమానుల మ‌ధ్య రీసెంట్‌గా చెల‌రేగిన ఈ చిచ్చు మ‌రో  నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. తిరుపతికి చెందిన వినోద్‌ రాయల్‌ జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్‌కు వీరాభిమాని. పార్టీ తరపున తరచూ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు.


ఈ క్రమంలో ఆదివారం కర్ణాటకలోని కోలార్‌లో పవన్‌కల్యాణ్‌ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన అవయవదాన కార్యక్రమంలో వినోద్ పాల్గొన్నాడు. ఆ త‌ర్వాత స్నేహితుల నడుమ జూనియర్ ఎన్టీఆర్, పవన కల్యాణ్‌ విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తమ హీరో గొప్ప అంటూ ఎవరికి వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన ఆ హీరో అభిమాని వినోద్‌ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. సోమవారం నగరంలోని వినోద్‌ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్‌... తాజాగా తిరుపతికి వెళ్లి వినోద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హీరోలంతా ఒకటేనని, తమ కోసం అభిమానులెవరూ ఇలా చేయకూడదని పవన్ కల్యాణ్ సూచించాడు.అభిమానుల మ‌ధ్య ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవ‌డం ఇప్పుడే కొత్తేం కాదు. అడ‌పాదడ‌పా అభిమానుల మ‌ధ్య చిచ్చు రేగుతూనే వుంది. ప్రాణాలు కోల్పోతూనే వున్నారు.

Image result for tollywood heros fans hungama

గ‌త ఏడాది భీమవరంలో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య నెల‌కొన్న వివాదం ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. ఒక హీరోకు చెందిన ఫ్లెక్సీని మరో హీరో అభిమానులు అడ్డవంతెన ప్రాంతంలో చించివేశారన్న ఆరోపణతో సదరు హీరో అభిమానులు ఆందోళనకు దిగారు. మరో హీరో అభిమానులు కూడా తమ అభిమాన నటుని ఫ్లెక్సీలు చించివేశారని ఆరోపించారు. ఈ వివాదం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ‘ఇగో’అనేది మానవుల్లో సహజం. చిత్ర పరిశ్రమలో అయితే ఇది మరీ ఎక్కువ. మా మధ్య విభేదాలు లేవంటూనే తగాదాలు పడడం కనిపిస్తూ వుంటుంది. 75 ఏళ్ళ తెలుగు చలనచిత్ర వజ్రోత్సవాల వివాదం ఇంకా స‌గ‌టు అభిమాని గుండెల్లో గుచ్చుకుంటూనే వుంది. ఈ విషయంలో హీరోలు ఫుల్‌స్టాప్ పెట్టినా ఫ్యాన్స్ మాత్రం దీనిని ‘కామా’గానే భావిస్తుంటారు. నిజానికి హీరోలు తమలోని అన్ని భావాలను వ్యక్తీకరించాలనుకోవడం వారికి శాపంగానే మారుతుంది.

Image result for tollywood heros fans hungama

చిత్రపరిశ్రమలో మేమంతా ఒక్కటేనని ఎన్నిసార్లు ప్రకటించినా వివాదాలు చెలరేగినపుడు ఎవరికివారే అన్నట్లు వ్యవహరించడం చూస్తుంటే వారిలో అనైక్యత కనిపించకనే కనిపిస్తుంది. సినిమా విడుద‌ల‌కు ముందు ఆడియో ఫంక్ష‌న్ల‌లోనే స‌ద‌రు హీరోలు నా అభిమానులే నా దేవుళ్లు అంటూ డైలాగ్‌లు చెప్ప‌డం కామ‌న్ అయిపోయింది. అయితే మిగ‌తా స‌మయాల్లోనూ స‌ద‌రు హీరోలు త‌మ‌ ఫ్యాన్స్ తో స‌మావేశం అవుతుండాలి. విడుద‌ల స‌మ‌యంలోనే అభిమాని గుర్తుకు రావ‌డం ఒక త‌ప్ప‌యితే, వారికి హిత‌భోద చేయ‌క‌పోవ‌డం మ‌రో త‌ప్పుగా గుర్తించాలి. ప‌లు జిల్లాల్లో అభిమానుల నిండు ప్రాణాలు గాల్లో క‌లిసిపోతున్నాయి. దానికి ప‌రోక్ష కార‌ణం తామేన‌ని గుర్తించాలి. ఓ స్టార్ హీరోలు.. ఇక‌నైన మీ ఇగోలు ప‌క్క‌న పెట్టండి.. అభిమానుల‌తో క‌లిసి మ‌న‌సు విప్పి మాట్లాడండి.. ఇత‌రుల‌తో త‌గాద పెట్టుకుంటే జ‌రిగే న‌ష్టం వివ‌రించండి. అంతేగాని ఇలా సైలెంట్‌గా ఉండిపోకండి. అభిమానులంటే అల‌జ‌డులు సృష్టించే వాళ్లు కాద‌ని నిరూపించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: