' ఆస్కార్ ' ప్రపంచం లో అనేక రంగాల్లో సేవలు చేసేవారికి నోబుల్ బహుమతి ఎంత ముఖ్యమో, ప్రధానమో సినిమాల పరంగా ఈ ఆస్కార్ అంత ప్రధానం. ప్రతీ సినిమా వ్యక్తీ జీవితంలో ఒక్కసారైనా దీన్ని అందుకోవాలని కాదు కాదు, ఈ అవార్డులలో నామినీ అవ్వాలి అని, కనీసం ఈ అవార్డు ఫంక్షన్ ని కళ్ళారా లైవ్ లో చూడాలని అనుకుంటాడు .. తప్పులేదు ఆస్కార్ రేంజ్ - స్టామినా అంతగా ఉంటుంది మరి. భారతీయ సినిమాకి ఆస్కార్ లో పేరు వినిపించిన సందర్భాలు ఒక్క చేతి వేళ్ళ తోనే లెక్కించుకోవచ్చు. ఇక తెలుగు సినిమాకి అంతటి ఘన కీర్తి రాలేదు కూడా. కానీ బాహుబలి సినిమా తరవాత పరిస్థితి మారుతుంది అని అందరూ నమ్మారు. బాక్స్ ఆఫీస్ స్టామినా లో భారత దేశం తరఫున ప్రపంచానికి షాక్ ఇచ్చిన సినిమా బాహుబలి.

విజువల్ ఎఫ్ఫెక్ట్ ల విషయంలో రాజీలేని రాజమౌళి ప్రపంచం నివ్వెరపోయే దృశ్యాలని అతి తక్కువ బడ్జెట్ లో చేసి చూపించాడు. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత పెద్ద వార్ జోనర్ సినిమా తీయచ్చా ? అనే ఆశ్చర్యం వేస్తుంది ఈ సినిమా చూస్తే. ఆ విషయం లో మౌళి ని మించినవారు కొట్టేవారు లేరనే చెప్పాలి. ఎందరికో అసాధ్యం అనుకున్న విషయాన్ని మౌళి సుసాధ్యం చేసి చూపించాడు. కఠోర శ్రమ తో మూడున్నర సంవత్సరాలు కష్టపడిన బాహుబలి బృందానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆరొందల యాభై కోట్ల వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా లాగేసిన బాహుబలి చిత్రం తనకి తిరుగులేదు అని నిరూపించుకుంది. అయితే ఈ వసూళ్ళ తో మౌళి హ్యాపీగా లేడు, ఆయన లక్ష్యం ' ఆస్కార్ ' . తన సినిమాలో ఎదో ఒక విభాగానికి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి సినిమాలో వాడిన విజువల్ ఎఫ్ఫెక్ట్ ల వరకూ , ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కెమెరామాన్ వరకూ ఎవరో ఒకరికి ఆస్కార్ వరిస్తుంది అని రాజమౌళి కలలు కన్నాడు.

తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా బాహుబలి అంటూ రెప రెప లాడించిన రాజమౌళి కి ఆస్కార్ లో అడుగుపెట్టాలి అనే కోరిక ఉండడం పెద్ద తప్పేమీ కూడా కాదు. నిపుణులు, విశ్లేషకులు కూడా బాహుబలి కి ఆ రేంజ్ ఉంది అనీ తేలికగా ఎదిగి ఆస్కార్ లో ఎదో ఒక స్థానం సంపాదిస్తుంది అనీ అనుకున్నారు. అయితే తాజా పరిణామం రాజమౌళి తో పాటు బాహుబలి ని పొగిడేవారు అందరికీ షాక్ ఇచ్చింది. ప్రతీ సంవత్సరం ఆస్కార్ ఎంట్రీ కి ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు కోసం మన దేశం నుంచి అధికారిక ఎంట్రీ ఒకటి వెళుతుంది ఈసారి దేశ వ్యాప్తంగా 29 సినిమాలు పోటీ ప‌డ్డాయి. అందులో మ‌న తెలుగు నుంచి రుద్రమ దేవి, కంచె చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈ సారి భార‌త చల‌న చిత్ర స‌మాఖ్య త‌మిళ చిత్రం విసార‌ణైని ఎంపిక చేసింది. కోటాను కోట్లతో తీసిన బాహుబలి లాంటి సినిమాలని పక్కన పెట్టి కేవలం కోటిన్నర బడ్జెట్ ఉన్న విసారనై సినిమాని ఎంచుకున్నారు. మన సినిమాలో లేనిది ఆ సినిమాలో ఉన్నది ఏమిటా అని తేడా చూస్తే ' వాస్తవికత ' అనే సమాధానం బయటకి ఒస్తోంది.

రుద్రమదేవి లాంటి సినిమాల్లో కూడా వాస్తవికత, భారీ తనం ఉంది కానీ విజువల్ హంగులు - హడావిడి చాలా వరకూ ఎక్కువ అనే చెప్పాలి. రుద్రమ దేవి ఒరిజినల్ చరిత్ర కి కాస్త మసాలా కలిపి మరీ దట్టించిన సినిమా అది. ఇక బాహుబలి విషయం లో ఈ సినిమా మొత్తం పూర్తిగా ఫాంటసీ చిత్రం. ఎవ్వరినీ , ఏ రాజుని గురించీ మాట్లాడిన సందర్భం లేదు. విజువల్స్ లో ఉన్న బలం కథలో లేదు అనే మాటలు మొదటి నుంచీ వచ్చాయి. ఇదే విష‌యం మ‌న‌వాళ్లని అడిగితే.. `అవార్డు సినిమాలెవ‌డికి కావాలండీ` అంటూ క‌మ‌ర్షియ‌ల్ గా మాట్లాడ‌తారు. నిజ‌మే.. సినిమా వ్యాపారం.

డబ్బుకోసమే తీస్తున్నారు కానీ ధనుష్ పెట్టిన కోటిన్నర  పెట్టుబడి కి అక్కడ విసారనై కి పది కోట్ల వరకూ వచ్చింది. అలా చూసుకుంటే డబ్బు అందరికీ ప్రదానమేకదా .ఇలాంటి ప్రయత్నాలు మన తెలుగు హీరోలు కూడా చెయ్యాలి అనేది సగటు తెలుగు ప్రేక్షకుడి తపన. తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే వేరే హీరోలని పెట్టి తీసి తాము ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: