క్తి స్వరూపమైన దుర్గాదేవి విశేష పూజలు అందుకునే శరన్నవరాత్రులు నేటి నుండి ప్రారంభం అవుతున్నాయి.  ఈసారి 11 రోజులపాటు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి.  ఈ వేడుకలలో ఆదిశక్తిని ఎవరికి తోచిన విధంగా వారు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆరాధిస్తూ ఉంటారు.  ఒకకోక్కరోజు ఒకొక్క రూపంలో అమ్మను ఆరాధించడం మన సాంప్రదాయం.  ఈ నవరాత్రులు శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు.  

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

అంటూ జగన్మాతను ఈ పదిరోజులు పూజిస్తాం.  ఈ నవరాత్రులలో కలశ పూజ – కుమారి పూజ – సహస్ర నామావళి – శ్రీచక్ర ఆరాధన – చండీయాగం – సప్తశ్లోకీ పారాయణం ముఖ్యంగా జరిగే ఘట్టాలు.  ఈ ఉత్సవాలలో మొదటి మూడు రోజులు అమ్మవారిని ‘మహాలక్షీ’ గా తరువాత మూడు రోజులు ‘దుర్గాదేవి’ గా చివరి మూడు రోజులు ‘సరస్వతీదేవి’ గా ఆరాధిస్తాం.  దేవీ నవరాత్రులలో దేవీ అలంకారాలు ఒక్కోరోజు ఒక్కో విధంగా ఉంటాయి. దేవీ వివిధ అవతారాలకు ప్రతిరోజు ప్రసాదం విభిన్నంగా ఉంటుంది. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని అంటారు. 

నవరాత్రులలో దేవికి విశేష పూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలాత్రిపుర సుందరి మంత్రం గొప్పది. నరాత్రులలో అలంకారాలుగా చేసి అర్పించేటప్పుడు బాలా త్రిపురసుందరి, దుర్గాదేవి, మహిషాసురమర్ధిని, రాజరాజేశ్వరి, లలిత అనే అలంకారాలలో భక్తులు అర్చించుకుంటారు. రాముడు కూడ దేవీ నవరాత్రులను దీక్షతో చేసి విజయదశమి నాడే రావణాసురుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడని అలా విజయదశమినాడు వెళ్ళినందువల్లనే ఆయనకు విజయం చేకూరిందని పురాణకథలు వివరిస్తున్నాయి. 

కరుణకు మారుపేరు అమ్మ. భక్తి ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ జగన్మాత ఉంటుంది అని అంటారు.  ఆమెను భక్తితో పూజిస్తే అమ్మ ఇవ్వని వరం అంటూ ఉండదు.  ఈనాటి నుండి దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అమ్మవారిని  ‘శైలపుత్రి’ గా ఆరాధిస్తాం.  దుర్గ శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. 

దక్షుని ప్రథమ పుత్రికగా శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి శూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి.  

ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది అని అంటారు. ఈరోజు నుండి ప్రారంభం అయ్యే దేవినరాత్రులలో దుర్గాదేవి భక్తికి లొంగే శక్తిగా మారి అందరికీ మంచి జరగాలని కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: