చిత్రం : ఓనమాలు బ్యానర్ : సన్ షైన్ సినిమా నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, కళ్యాణి, చలపతిరావు, గిరిబాబు, ఢిల్లీ రాజేశ్వరీ తదితరలు. ఫోటోగ్రఫీ : హరి అనుమోలు, సంగీతం : కోటి, మాటలు : ఖదీర్ బాబు, దర్శకత్వం : క్రాంతి మాధవ్, రేటింగ్ : 3/5  ప్రస్తుతం సినిమాల పోకడ మనం చూస్తూనే ఉన్నాం. ఏ సినిమా చూసినా మితిమీరిన హింసతోనూ, మోతాదు మించిన శృంగారంతోనూ లేకపోతే ఈ రెండిటికి మించిన భీభత్సమైన కామెడీతోనూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇదేమంటే ఇదే ట్రెండ్ అంటున్నారు. సినిమా పోషకులు యువతే కాబట్టి వారికి నచ్చే సినిమాలు ఇవే అంటున్నారు. అంతగా అడిగితే ఇలాంటి సినిమాలనే వారు చూస్తున్నారంటూ తప్పును ప్రేక్షకుల మీదకి నట్టేస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ లో ప్రస్తుత జనరేషన్ లో చాలా మందికి అర్థం కాని ’ఓనమాలు‘ అనే టైటిల్ పెట్టి, జనం ఉండటానికి ఇష్టపడని పల్లెటూళ్ళ నేపథ్యం మీద ఒక క్లీన్ సినిమా తీయడానికి సిద్దపడ్డ ఈ సినిమా నిర్మాత, దర్శక ను ముందుగా అభినందిస్తూ... రాజేంద్ర ప్రసాద్ గురించి నేడు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సి పనిలేదు. కానీ, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల తరువాత ఆయనకు ఉన్న ఇమేజ్ మీద, ఆయన సినిమాల మీద కొత్త యాంగిల్ వచ్చింది. ఏ పాత్రనైనా ఆవలీలగా పోషించగల రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన, కొత్త దర్శకుడు ఉత్తమ అభిరుచిలతో తీసిన సినిమా ఓనమాలు. కథ : నారాయణరావు మాస్టారు (రాజేంద్రప్రసాద్)కు తన ఊరు అన్నా, తన ఊరి మనుషులు అన్నా ఎంతో అభిమానం. ఈ కారణంగానే న్యూయర్క్ లో తన కొడుకు ఇంట్లో ఉండలేక తన ఊరుకి తిరిగి వచ్చేస్తాడు. అయితే అక్కడికి తిరిగి వచ్చేసరికి ఊరు అనేక సమస్యల్లో చిక్కుకుని ఉంటుంది. ఆ సమస్యల నుంచి ఊరిని నారాయణ మాస్టారు ఎలా రక్షించారన్నదే చిత్రకథ. నటీనటుల ప్రతిభ : రాజేంద్రప్రసాద్ ఎప్పటిలానే తన పాత్రకు జీవం పోశారు. కళ్యాణి తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా సహాజ నటనతో అలరించింది. చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి, గిరిబాబు, రఘుబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక వర్గం : ఫోటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. సంగీతం ఆహ్లదకరంగా ఉంది. పాటలు సందర్భానికి తగినట్లుగా ఉన్నాయి. కథ, కథనాలు నెమ్మదిగా సాగే ఈ సినిమాలో మాటల రచయిత తన కలం పదును చూపించాడు. సినిమా మాటలు అంటే పంచ్ డైలాగులే అని భావిస్తున్న ఈ రోజుల్లో సరైన మాటలకు ఉండే పవర్ చాటాడు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం అందంగా రావడానికి మాటల రచయిత కృషి ఎంతైనా ఉంది. ‘కూర్చుని తిండే కొండలైనా కరుగుతాయేమో కానీ, పెడితే తరగవు రా..’, ‘ స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు అయినా, 24 గంటలు కరెంటు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం.’ వంటి ఆలోచించే మాటలతో పాటు ‘కంపెనీ లేకుండా మందు కొట్టడం, పిల్ల లేకుండా పెళ్లి చేసుకోవడం ఒకటే’, ‘చేప తింటుంటే ముల్లు గుచ్చుకుంటున్నాయా.. అయితే చెప్పులు వేసుకుని తిను’ వంటి చమక్కులు రచయిత కలం నుంచి జాలువారాయి. సున్నితమైన కథను దర్శకుడు అందంగా తెరకెక్కించాడు. మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. మంచి సందేశంతో తీసిన ఈ సినిమా దర్శకుడి ప్రతిభను తెలుపుతుంది. హైలెట్స్ : రాజేంద్ర ప్రసాద్ నటన, సంభాషణలు, సంగీతం. డ్రాబాక్స్ : నెమ్మదిగా సాగే కథనం, ట్రెండ్ కు దూరంగా ఉన్న నేపథ్యం. చివరిగా: కొత్తదనం కోసం అంటూ అతిగా పోకుండా, భారీ హంగులకు లేకుండా తెలిసిన నేపథ్యంలో సాగిన ’ఓనమాలు‘ ఆకట్టుకునే విధంగా ఉంది. కుటుంబ సమేతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చిత్రం చూడవచ్చు. అయితే, యువత కోసం, అలాగే ఒక వర్గం ప్రేక్షకుల కోసమంటూ ప్రత్యేక దృశ్యాలు లేకపోవడం బాక్సాఫీసు వద్ద ఈ సినిమా విజయంపై ప్రభావం చూపించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: