భారతీయ సినిమా వందేళ్ల పండగ జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు, మరెన్నో రికార్డులతో మన పరిశ్రమ ఘనంగా వర్థిల్లుతోంది.  వందేళ్ల సినీ పండగ సందర్భంగా భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 143వ జయంతి సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలు మీ కోసం.

చరిత్ర మొదలవడానికి తొలి అడుగు ఎంతో కీలకం. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఇంత ఎత్తులో నిలబడటానికి వందేళ్ల క్రితం దాదాసాహెబ్ ఫాల్కె వేసిన ఆ తొలి అడుగే కీలకం. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నేడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది ప్రజలకు మరింత చేరువైంది. అటువంటి సినిమా అనే ప్రక్రియకు అసలు తెరరూపానికి అంకురార్పణ చేసిన మహనీయుడు 'దాదాఫాల్కే'. దాదాసాహెబ్ ఫాల్కె అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. సరిగ్గా 143 ఏళ్ల క్రితం నాసిక్‌కు సమీపంలోని త్రియంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బరోడాలోని కళాభవన్‌లలో ఆయన విద్యాభ్యాసం చేశారు.  ఎన్నో కష్టనష్టాలు ఓర్చి మనదేశంలో చిత్ర నిర్మాణం ప్రారంభం కావడానికి, ఊపు అందుకోడానికి కృషి చేసి విజయం సాధించారు.

1910లో 'లైఫ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌' సినిమాచూసాక ఫాల్కె జీవన సరళి మారిపోయింది. 'ఇక్కడ మనం ఎందుకు సినిమాలు తీయకూడదు' అనే ఆలోచన వచ్చి కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌ తీశారు. అనుభవం కోసం 1912లో లండన్‌ వెళ్లి వాల్టన్‌ స్టూడియోలో కొంత శిక్షణ పొంది, విలమ్స్‌న్‌ కెమెరా, మరికొన్ని పరికరాలు కొని, బొంబాయి చేరుకుని దాదర్‌ రోడ్లో ఫాల్కె ఫిలిమ్స్‌ స్టూడియో ప్రారంభించారు. ఫాల్కె భార్య సరస్వతి స్టూడియో నిర్వహణ చూసుకుంటూంటే తన ఇన్సూరెన్స్‌ పాలసీని కుదువపెట్టి చిత్ర నిర్మాణం, దర్శకత్వం తదితర అంశాలపై ఈయన దృష్టి పెట్టారు.

సినిమాపై తనకు తప్ప ఎవరికీ అనుభవం లేనందున తానే స్క్రిప్ట్‌ తయారు చేసుకుని, ప్రొడక్షన్స్‌, దర్శకత్వం, ఛాయాగ్రహణం, లైటింగ్‌, ఎడిటింగ్‌ ఇలా అన్ని శాఖలూ నిర్వహిస్తూ, 'రాజా హరిశ్చంద్ర మూకీ చిత్రాన్ని రూపొందించారు. అప్పుడు వచ్చే ఫిలిం ఫ్రేమ్‌ చుట్టూ 'హాల్స్‌' ఉండేవి కావు. అందువల్ల ప్రొజెక్టర్‌లో పెట్టి కదిలించడానికి వీలుండేది కాదు. డార్క్‌ రూమ్‌లో కూర్చుని ఫిలిం రీల్‌కి హోల్స్‌ పెట్టేవారు. తరువాత భార్యకూ శిక్షణ ఇచ్చారు. అలా కష్టపడి భారత దేశంలో భారతీయుడుగా 'రాజా హరిశ్చంద్ర'ని వందేళ్ల క్రితం.. 1913 మే 3న బొంబాయిలోని కారొనేషన్‌ థియేటర్లో విడుదల చేసారు. చూసిన వారు ఆశ్చర్య చకితులు కావడంతో మరింత అనుభవం కోసం మరోసారి ఇంగ్లండ్‌ వెళ్లి, ట్రేడ్‌ షాలు నిర్వహించి, మరికొన్ని సినిమా పరికరాలు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. 'మోహినీ భస్మాసుర్‌, సత్యవాన్‌ సావిత్రి, స్వప్న్‌విహార్‌, కార్తీక్‌ పూర్ణిమ ఉత్సవ్‌, లంకాదహన్‌' మున్నగు మూకీ చిత్రాలు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అయిదుగురి భాగస్వామ్యంలో 1918లో హిందూస్థాన్‌ ఫిలిమ్స్‌ సంస్థను నెలకొల్పి 'శ్రీకృష్ణజన్మ, కాళీయమర్దన్‌, సంత్‌ నామ్‌దేవ్‌, రాజర్షి అంబరీష్‌, మహానంద్‌, జరాసంధ్‌ కథ' వంటి మూకీ చిత్రాలు రూపొందించారు.

1913లో ఆయన తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన ఆయన సినీ జీవితం 19 ఏళ్ల పాటు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఈ కాలంలో ఆయన 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించారు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా ఆయన సినీపరిశ్రమకు తిరిగివెచ్చించారు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషిచేశారు.

దాదా ఫాల్కె రూపొందించిన చివరి మూకీ చిత్రం సేతు బంధన్‌ 1932లో విడుదలైంది. ఈ చిత్రాన్ని మరికొన్ని మార్పులు చేసి టాకీ చిత్రంగా 1934లో మళ్లీ విడుదల చేశారు. ఇక టాకీ చిత్రంగా 1937లో గంగావతరణ్‌ చిత్రాన్ని రూపొందించారు. ఫ్లాప్‌ అయింది. అప్పటికే ఆర్థికంగా నష్టపోయి సినీరంగంలో వచ్చిన మార్పులు జీర్ణించుకోలేక ఫాల్కే నాసిక్‌ వెళ్లిపోయారు. మొత్తానికి భారతీయ సినీ పరిశ్రమకు ఆధ్యుడుగా నిలిచిన దాదా సాహెబ్ ఫాల్కె 1944లో భౌతికంగా దూరమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆయన శత జయంతి సందర్భంగా సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి 1969లో 'దాదాసాహెబ్‌ ఫాల్కె అవార్డు' ప్రవేశపెట్టారు. సినీ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారికి ప్రతి ఏటా ఈ అవార్డును ప్రధానం చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ పరిశ్రమ వందేళ్ల పండగ జరుపుకుంటూ ఆయనను స్మరించుకుంటోంది. వందేళ్లే కాదు మరో వెయ్యేళ్లయినా భారతీయ సినీ పరిశ్రమకు దాదా సాహెబ్ అందించిన సేవలు ఎవరు మరిచిపోరు.

మరింత సమాచారం తెలుసుకోండి: