కామెడీ క‌రివేపాకు కాదిప్పుడు. సినిమాని నిల‌బెట్టేది, జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ ర‌ప్పించేది కామెడీనే. సినిమా వాళ్ల దృష్టిలో బ్ర‌హ్మానందం, ఎమ్మెస్ నారాయ‌ణ‌... వీళ్లిద్ద‌రూ పెద్ద స్టార్స్‌!! `రూ.50 కోట్లు పెట్టి క‌మెడియ‌న్ల‌తో నేను సినిమాలు తీయ‌ను..` అని బోయ‌పాటి శ్రీ‌ను సెటైర్లు వేసినా...మిగ‌తావారంతా న‌డుస్తున్న‌ది ఆ బాట‌లోనే!  బ్ర‌హ్మానందం అండ్ గ్యాంగ్ లేక‌పోతే టికెట్లు తెగ‌వు... అనే నిర్ణయానికి వ‌చ్చేశారు. అందుకే కామెడియ‌న్లు కాస్త స్టార్ల‌యిపోయారు. అలీ, ధ‌ర్మ‌వ‌ర‌పు, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, ర‌ఘుబాబు.... వీళ్లంద‌రినీ న‌మ్ముకొని సినిమాలు న‌డిపిస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో హీరో ఇమేజ్‌కి కాస్త డామేజ్ అయినా ప‌ట్టించుకోవ‌డం లేదు.

బాద్‌షా సినిమాలో బ్ర‌హ్మానందం రెండో హీరో... అన్న‌వాళ్లు ఉన్నారు. ఆ మాట నిజం కూడా. ఎందుకంటే బాద్‌షా సెకండాఫ్ ఆయ‌న చుట్టూనే తిరిగింది. తొలి భాగంలో  ఎమ్మెస్‌నారాయ‌ణ‌ని న‌మ్ముకొన్నారు. వీళ్లిద్ద‌రూ లేక‌పోతే... బాద్‌షాకి ఆ మాత్రం వ‌సూళ్ల‌యినా ద‌క్కేవి కావేమో. అంతెందుకు దూకుడు లో కూడా వీరిద్ద‌రిదే సింహ‌భాగం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంతా వీళ్ల చుట్టూనే తిరుగుతుంది. షాడోలో ఎమ్మెస్ హ‌వా క‌నిపించింది. ఆ పాత్ర పండ‌క‌పోయినా - ఎమ్మెస్‌కి ఇచ్చిన ప్రాధాన్యం త‌క్కువ కాదు. ఇది వ‌ర‌కు పెద్ద హీరోల ప్ర‌చార చిత్రాలు.. కేవ‌లం ఆ హీరోల చుట్టూనే తిరిగేవి. థియేట‌ర్ ట్రైల‌ర్ల‌లో వారిదే హ‌వా. అయితే ఈ ప‌ద్ధ‌తి మారింది. `మా సినిమాలో ఇంత మంది క‌మెడియ‌న్లు ఉన్నారు. కావ‌లిస్తే చూడండి..` అంటూ వాళ్ల‌మీద కూడా ట్రైల‌ర్లు క‌ట్ అవుతున్నాయి. బాద్‌షా విడుద‌లైన రెండో వారంలోనే బ్ర‌హ్మానందం ట్రైల‌ర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. షాడోకి అంత టైమ్ తీసుకోలేదు. రెండో రోజు నుంచే ఎమ్మెస్‌ని హీరోని చేశాయి. గ్రీకువీరుడు ఓ అడుగు ముందుకేసి.. సినిమా విడుద‌ల‌కు ముందే క‌మిడియ‌న్ల ట్రైల‌ర్ల‌ను దించేశారు. ఇవ‌న్నీ జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికే!

మరింత సమాచారం తెలుసుకోండి: