హీరోలతో సమానంగా గుర్తింపుతెచ్చుకున్న హీరోయిన్లు అరుదుగా కనిపిస్తారు. హీరోయిన్లు గ్లామర్ డాల్ గా మారిపోయిన నేటి రోజుల్లో ఇదీ మరీ వింత. అయితే ఈ అసాధ్యాన్ని సాధించి చూపించిన హీరోయిన్ త్రిష. ఈ ముద్దుగుమ్మకు హీరోలతో సమానంగా క్రేజ్ ఉండటమే కాదు, ఇటీవల కాలంలో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా రాణిస్తున్న ఘనత నూ సొంతం చేసుకుంది.

తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష 1983 మే 4న చెన్నై లో జన్మించింది. 1999లో మిస్ మద్రాస్ గా ఎన్నికయ్యింది. 2001లో మిస్ ఇండియా పోటీల్లో ‘బ్యూటిఫుల్ స్మైల్’ అవార్డును గెలుచుకుంది. 

1999లో విడుదలయ్యిన ‘జోడీ’ సినిమాతో చిత్ర సీమలో ప్రవేశించింది. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలుగా కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఎమ్మెస్ రాజ్ నిర్మించిన ‘వర్షం’ సినిమాతో తెలుగులో అగ్రహీరోయిన్ గా మారింది. ఈ సినిమాలో ‘ఎన్నాళ్లనీ దాక్కుంటావు పైన..’ అనే ఒక్క పాటతోనే త్రిష తెలుగు వారిని విశేషంగా ఆకర్షించింది. ఇందులో ‘శైలజ’గా త్రిష నటన అందర్నీ మెప్పించింది. తరువాత త్రిష ఎన్నో వైవిధ్య పాత్రలతో తెలుగులో టాప్ హీరోయిన్ గా మారింది. అందం, అభినయాలతో తన పాత్రలను పండించింది. 

‘నవ్వువస్తానంటే నేనొద్దాంటానా..’ సినిమాలో సిరి పాత్ర త్రిష కెరియర్ లో అణిముత్యంగా నిలుస్తుంది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా త్రిష నంది అవార్డును కూడా గెలుచుకుంది. అన్నయ్య మాట దాటని చెల్లిగా, ప్రేమ ను వదులుకోలేని ప్రియరాలుగా త్రిష నటన అమోఘం అనిపిస్తుంది. తరువాత ‘అతడు’ సినిమాలో పూరీ గా త్రిష నటన చక్కిలిగింతలు పెడుతుంది. అమాయకత్వం-గడసుతనం కలగలిసిన పూరీ పాత్ర ను త్రిష తప్ప మరే హీరోయిన్ చెయ్యలేదు అనిపిస్తుంది. ఇందులో కొన్ని సన్నివేశాల్లో హీరో మహేష్ ను త్రిష డామినేట్ చేసిన విషయం చూస్తే నటిగా త్రిష గొప్పతనం అర్థం అవుతుంది.

తెలుగు లోనే కాదు.. మాతృభాష తమిళంలోనూ త్రిష టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిందీ సినిమాల్లోనూ త్రిష నటించింది. 

కాగా, త్రిష ప్రస్తుతం ‘రమ్’ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: