భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ పాల్కే “రాజా హరిచంద్ర” సినిమా నిర్మిస్తూ చంద్రమతి పాత్ర కోసం ఆర్టిస్ట్ లను వెతుకుతూ ఉంటె ఆ పాత్ర పోషించడానికి ఎవరూ ముందుకు రాలేదట. అంతేకాదు ఆ రోజులలో వేశ్య వృతిలో ఉన్నవారు సైతం సినిమాలలో నటించడానికి ఇష్టపడే వారు కాదట. అటువంటి పరిస్థితులలో దాదాసాహెబ్, ఎ.సాలుంకే అనే వంటమనిషిని నెలకు 15రూ. జీతం మీద చంద్రమతి పాత్రకోసం ఎంపిక చేశారట. ఆ తరువాత కాలంలో నెమ్మదిగా డాన్సర్స్, నాటక రంగానికి చెందిన నటీమణులు సినిమాలలో నటించడానికి ముందుకు వచ్చినా, ఉన్నత కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు మాత్రం సినిమాలు అంటే చాలా దూరంలో ఉండే వారట.

 ఆ పరిస్థితులలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దేవికారాణి చిత్ర రంగంలోకి ప్రవేశించి పరిశ్రమకు కొత్త వెలుగు తెచ్చారు. మరోమాటలో చెప్పాలి అంటే మన ఇండియన్ సినిమాకు మొట్టమొదటి పాపులర్ హీరోయిన్ గా దేవికారాణి పేరే చెపుతారు. ఈమె సుప్రసిద్ధ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ముని మనుమరాలు అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అలాగే ఆమె విశాఖపట్నంలో పుట్టింది అంటే చాలామంది ఆశ్చర్య పోతారు. దేవికారాణి అందం, తెలివితేటలు చూసి అప్పట్లో సినిమా రంగంలో పేరుగాంచిన హిమంశురాయ్ ని ఆకర్షించాయి. రాయ్ చిత్రాలకు కాస్ట్యుమ్స్ డిజైనర్ గా పనిచేసిన దేవికారాణి 1929 లో హిమాంశురాయ్ ని పెళ్లి చేసుకుంది.

 ఈ వివాహం భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఒక మలుపు తిప్పింది అని అనుకోవాలి. వీరి వివాహం తరువాత తాము సొంతంగా సినిమాలు ఎందుకు తియకుడదు? అన్న ఆలోచన కలిగి 1934 లో బాంబే టాకీస్ అనే స్టూడియో ను నిర్మించారు. ఈ స్టూడియో నుండి అనేక సినిమాలు వచ్చాయి. తన భర్త మరణించిన తరువాత కూడా దేవికారాణి ఈ స్టూడియో ద్వారా అనేక సినిమాలు నిర్మించారు. మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను పొందిన తొలి వ్యక్తి దేవికారాణి కావడం గమనార్హం. భారతీయ సినిమా వందేళ్ళ చరిత్రలో దేవికారాణి ప్రస్తావన లేకుండా సినిమా చరిత్ర ముందుకు నడవదు. ఒక్కమాటలో చెప్పాలి అంటే భారతీయ సినిమాకు తోలివెలుగు దేవికారాణి...

మరింత సమాచారం తెలుసుకోండి: