శకుని ప్రస్తావన లేకుండా మహా భారత కధ ఉండదు. శకుని పాత్ర లేకుండా మహా భారత సినిమాలు కూడా ఉండవు. నటుడు ధూళిపాళ పేరు వినగానే ఆయన నటించిన శకుని పాత్ర తెలుగు ప్రేక్షకుల మనో ఫలకంపై కదలాడుతుంది. సి.ఎస్.ఆర్, లింగమూర్తి వంటి హేమాహేమీలు పోషించిన విలక్షణమైన శకుని పాత్రకు కేరాఫ్ అడ్రెస్ గా ఆయన నట ప్రస్తానం కొనసాగింది. రంగస్థల నటుడు అయిన ధూళిపాళ అనేక పౌరాణిక నాటకాలలో నటించారు.

అయన నటనాప్రతిభను ఆనోటా ఆనోటా విన్న నందమూరి తారకరామారావు తాను నిర్మిస్తున్న “భీష్మ” సినిమాలో 1962 లో ఏకంగా రారాజు పాత్రనే ఇచ్చారు. వచ్చిన మొదటి అవకాశాన్నే అద్భుతంగా వినియోగించుకున్న ధూళిపాళ తన నటవిశ్వరూపాన్ని ఈ భీష్మ సినిమాలో చూపించారు. దాని తరువాత ఎన్నో పౌరాణిక పాత్రలు,సాంఘిక పాత్రలు ధూళిపాళ చేసినా, ఆయన నట జీవితాన్ని ఒక మలుపు తిప్పిన సినిమా “శ్రీకృష్ణ పాండవీయం”. ఈ సినిమాను కూడా ఎన్టీఆర్ నిర్మించారు.

ఈ సినిమాలో అప్పటి వరకూ తెలుగు పౌరాణిక సినిమాలలో వచ్చిన శకుని పాత్రలకు భిన్నంగా ఆ పాత్రను తీర్చిదిద్ది, ఆ అవకాశాన్ని కూడా ఎన్టీఆర్ ధూళిపాళ కే ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఒక సవాలుగా భావించిన ధూళిపాళ శకుని అంటే నిజంగా ఇలాగే ఉంటాడేమో అనే రీతిలో చాలా అద్భుతంగా తన పాత్రను పోషించారు.ఆ తరువాత “దానవీర సురకర్ణ”, “శ్రీ మధ్విరాటపర్వం” సినిమాలలో శకునిగా రాణించిన మహానటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి. సినిమా రంగం నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక సన్యాసి గా మారిపోయి హనుమాన్ చాలీసా ను రాగయుక్తంగా పాడుతూ రాష్ట్రం యావత్తూ కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన ధన్యజీవి ధూళిపాళ సీతారామ శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: