ఆంగికం, వాచకం, అభినయం, హావభావం ఒకే వ్యక్తిలో కలబోస్తే ఆ వ్యక్తే నందమూరి తారక రామారావు‌. నాటకరంగ అనుభవంతో ఎప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా తన నటనలో పరిణితిని ప్రదర్శించేవారు. రాముడిగా, కృష్ణునిగా, శివుడిగా, భీష్ముడిగా, వెంకటేశ్వరునిగా ఆ దేవుళ్ల ప్రతిరూపంగా నటనలో జీవించేవారు. చేసే ప్రతి పాత్రనూ ఛాలెంజింగ్‌గా తీసుకుని చేసేవారు. అందుకే అంత పరిపూర్ణత కనిపిస్తుంది ఆయన నటనలో. మనం ఏనాడు చూడని రూపాలకు తన నటనతో అద్భుత రూపకల్పన చేసిన దైవాంశసంభూతుడాయన. ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలను విశ్లేషిద్దాం.

ఎన్టీఆర్ తొలిసారిగా పోషించిన పౌరాణిక పాత్ర నలకూబరుడు. 'మాయారంభ' (1950) చిత్రంలోని పాత్ర అది. ఈ సినిమా కూడా నాటకపక్కీలోనే రూపొందింది. ఇక అప్పటి నుంచి పౌరాణిక నాయకపాత్రలకూ, ప్రతినాయక పాత్రలకూ కూడా సరిపోయే ఏకైక నటునిగా ఎన్టీఆర్ ఎదిగారు. ఆ ఎదుగుదలలో నటనకు మంచిన ఆయన కృషి కనిపిస్తుంది. కృష్ణుని పాత్రలో నాజూకుగా, ఒద్దికగా ఇమిడిపోయిన రామారావే దుర్యోధనునిగా, రావణునిగా జూలు విదిల్చిన సింహంలా కనిపించడం చూసి ఎందరో ఆశ్చర్యపోయారు. అనితరసాధ్యమైన ఆయన అభినయ సామర్ధ్యానికి హారతులు పట్టారు.

'దాన వీర శూర కర్ణ' చిత్రంలో ఒకే ఫ్రేమ్‌లో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుని పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని పరవశుల్ని చేసిన ఎన్టీఆర్ , 'శ్రీమద్ విరాటపర్వం' చిత్రంలో ఐదు పాత్రలను పోషించి, దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు కూడా వహించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. తన నటనతో రావణాసురునికి ఎన్టీఆర్ ఆకర్షణ పెంచారు. అర్జునునికి క్రేజ్‌ని, భీముని రేంజ్‌ని పెంపొందించారు. భీష్మునికి పాపులారిటీ పెంచారు... ఇలా ఆ యా పాత్రలు ఎన్టీఆర్ కారణంగానే తమ పరిధిని పెంచుకున్నాయనడం అతిశయోక్తి కాదు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలంటే పౌరాణిక చిత్రాల అవసరం ఎంతైన ఉందని అభిప్రాయపడిన ఎన్టీఆర్ ఒక ఉద్యమస్థాయిలో పౌరాణిక పాత్రలను పోషించారని చెప్పాలి.

advertisements - Call 040 4260 1008

'మాయాబజార్'లో కృష్ణుడిగా విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్ 'భూకైలాస్'లో రావణబ్రహ్మ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసాడు. మళ్ళీ కలియుగ దైవం వెంకటేశ్వరుడిగా శ్రీవెంకటేశ్వర మహాత్మ్యంలో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. దర్శకుడిగా.. నిర్మాతగా.. మొదటి చిత్రం సీతారామ కళ్యాణంతోనే ఆయన ప్రయోగాల పరంపర మొదలయ్యింది. హరనాధ్ ని హీరోగా చేయించి.. తాను విలన్ కారక్టర్ అయిన రావణాసురుడిగా నటించడం.. విమర్శకుల మన్ననలే కాకుండా.. ప్రేక్షకుల మెప్పుని కూడా పొందింది. దానవీరశూరకర్ణలో మూడు పాత్రలు.. శ్రీమద్విరాటపర్వములో ఐదు పాత్రలు పోషించేవరకూ ఆయన ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన ప్రతినాయకుని పాత్రలను కూడా హీరోను డామినేటింగ్‌ చేసే విధంగా తానే నటించి మెప్పించేవారు. సీతారామ కళ్యాణంలో రావణాసురుని పాత్రలో అంతా తానై నడిపించారు. ఇక జానపద సినిమాలలోనూ కత్తిపట్టి అలనాటి యువ అభిమానులకు మరింత చేరువయ్యారు. రాజకుమారుడి గెటప్‌లో రామారావు కనిపించగానే రాజకుమారుడు అంటే ఇంత అందంగా ఉంటాడా అనిపించేలా ఉండేవారు.

అభిమానులకు, ప్రేక్షకులకు ఎన్టీఆర్‌ని వెండితెరపై చూస్తుంటే సాక్షాత్తు ఆ భగవంతుడే అన్న అనుభూతి కలిగేది. అందుకే ఆయన ఎదురుపడితే చాలు ఎంతో మంది సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. తిరుపతి వెంకన్న దర్శనం కాకపోయినా బాధపడేవారు కాదు కానీ చెన్నయ్ తీసుకెళ్లి ఎన్టీఆర్‌ని చూపించకపోతే గోలగోల చేసేవారట ఏపీ నుంచి టూరిస్టు బస్సుల్లో వచ్చేవారంతా. ఏ జన్మలో ఆయన చేసుకున్న పుణ్యమో అది. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు ప్రస్థావన రాగానే రామారావు పేరే గుర్తుకు వస్తుంది. ఆయా పాత్రలను పోషించడానికే ఆయన పుట్టారేమోనని కూడా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: