టాలీవుడ్ బడా నిర్మాతలు తమ సినిమా నిర్మాణ దృక్పధం మార్చుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే టాపిక్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ సంవత్సరం విడుదల అయిన టాప్ హీరోల సినిమాలపై వచ్చిన లాభాలు కంటే చిన్న హీరోల సినిమాలపై వచ్చిన లాబాలు ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ దృష్టి చిన్న హీరోలపై పడుతోంది అనే వార్తలు వస్తున్నాయి.

ఈ సంవత్సరం విడుదల అయి హిట్ సాధించిన “నాయక్”, “సీతమ్మ వాకిట్లో...”, “బాద్ షా” సినిమాలపై వచ్చిన లాబాలు కంటే చిన్న సినిమాలుగా వచ్చిన “స్వామి రారా”, “గుండేజారి గల్లంతైందే” సినిమాలకు మంచి లాభాలు రావడంతో నానా ప్రయాసలు పడి పెద్ద హీరోలతో సినిమాలు తీసే కన్నా అదే కష్టంతో చిన్న హీరోలతో రెండు మూడు సినిమాలు తీసుకుంటే నిర్మాతలకు లాభాల పంట పండుతుంది అనే కొత్త వాణిజ్య సూత్రం వైపు టాలీవుడ్ నిర్మాతల దృష్టి మళ్ళుతోంది అంటున్నారు. దీనికి ఉదాహరణ గా ప్రస్తుతం “రామయ్యా వస్తావయ్యా”, “ఎవడు” లాంటి భారీ సినిమాలు తీస్తున్న దిల్ రాజు, తన తదుపరి చిత్రంగా “ఇంటింటా అన్నమయ్య” సినిమా హీరో రేవంత్ హీరోగా అంతా కొత్త వారితో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

అసలు దిల్ రాజు కెరియర్ చిన్న సినిమాలతోనే మొదలు అయింది. నితిన్ హీరోగా “దిల్” సినిమాను నిర్మించిన రాజు, “ఆకాశమంత” సినిమాలాంటి వెరైటీ చిన్న సినిమాలు కూడా నిర్మించి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దిల్ రాజు ప్రయోగం విజయవంతం అయితే ప్రస్తుతం బడా సినిమాలు నిర్మిస్తున్న బడా నిర్మాతలు తమ సినిమా నిర్మాణ వ్యాపారానికి యు-టర్న్ తీసుకొని మళ్ళి చిన్న హీరోలవైపు వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు. అదే జరిగితే ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న బడా హీరోల పరిస్థితి ఏమిటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: