ఆ యువహీరో చేసినవి కేవలం రెండే రెండు సినిమాలు. మొదటి సినిమా అంతగా విజయవంతం కాకపోయినా రెండవ సినిమా అతడి అదృష్టం కలిసి వచ్చి, అనుకోని విజయాన్ని ఇచ్చింది. వీటితో పాటు సూపర్ స్టార్ ఇమేజ్ కి మరో వారసుడు అంటూ చేసిన ప్రచారం ఫలించింది. ఆ హీరో ఎవరో ఈపాటికే మీకు అర్ధం అయి ఉండాలి. అతడే సుదీర్ బాబు. టాలీవుడ్ ప్రిన్స్ కు బావ, టాలీవుడ్ సూపర్ స్టార్ కు ముద్దుల అల్లుడు. ఇతడు చేసిన మొదటి సినిమా “ఎస్ ఎమ్ ఎస్” తో పోలిస్తే, రెండవ సినిమా దర్శకుడు మారుతి ఇమేజ్ తో ఎలాగో అలాగ హిట్ టాక్ ని తెచ్చుకున్నాడు.

ఇంత వరకూ బాగుంది. కాని ఈ సినిమా ప్రమోషన్ లో బాగంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన “అల్లూరి సీతారామరాజు” ను ఈ ఘట్టమనేని వారి అల్లుడు రీమేక్ చేస్తాను అని అనడం టాలీవుడ్ లో అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, పెద్ద కామెడీ జోక్ గా మారిపొయింది. మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న నటులే తన తండ్రి సినిమాలను రీమేక్ చేయనని, వాటిపట్ల తనకు అపరితమైన గౌరవం ఉందని చెపుతూ ఉంటే, కేవలం రెండే రెండు సినిమాల హీరో సుదీర్ బాబు ఇంత భారీ డైలాగ్స్ ఎందుకు కొడుతున్నాడు అంటూ ఫిల్మ్ నగర్ లో చాలామంది జోక్స్ వేస్తున్నారు.

 కృష్ణ సినిమాలలోని పాటలను రీమిక్స్ చేసినంత సులువుగా, కృష్ణ నటించిన “అల్లూరి సీతారామరాజు” రీమేక్ చేయడం జరగని పని. ఈ నిజాలు తెలియక అమాయకంగా సుదీర్ బాబు అంటున్నాడా..? లేక రెండవ సినిమా విజయంతో వచ్చిన మితిమీరిన ఆత్మవిశ్వాసం తో సుదీర్ ఈ చిలకపలుకులు పలుకుతున్నాడా..? అనే విషయం ఇప్పుడు అందరికి సమాధానాలు లేని ప్రశ్నలుగా మారింది. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. కాని మరీ ఇంత పెద్ద కూతలు కూస్తే అది సుదీర్ బాబు కెరియర్ కే ప్రమాదం.
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: