సారధి వారి “రోజులు మారాయి” సినిమాలో ‘ఏరువాక సాగారో రన్నో చిన్నాన్నా’ పాటకు నృత్యం చేసి సంచలనం సృష్టించిన వహిదా రెహమాన్ ను ఎరుగని వారు ఉండరు. ఆమె 1950 ప్రాంతంలో తన సోదరి షహిదా తో కలిపి భరతనాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. ఆ క్రమంలోనే ఆమె ఎన్.టి.రామారావు దృష్టిలో పడడం, ఎన్టిఆర్ నటించిన “జయసింహ” సినిమాలో నాయికగా నటించే అవకాశం రావడం జరిగింది. ఆ సినిమాలో ఆర్.బాల సరస్వతి పాటలకు వహిదా చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేరు. ముఖ్యంగా “మదిలోని మధుర భావం” పాటకు వహిదా చేసిన నాట్యం ఇప్పటికీ పాత సినిమాలను అభిమానించే వారికి గుర్తుండిపోతుంది.

ఆ తరువాత ఆమె ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు గురుదత్ ప్రోత్సాహంతో హిందీ చిత్ర రంగానికి వెళ్ళి 1950  నుండి 1970 వరకూ రెండు దశాభ్దాల పాటు బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందారు వహిదా రెహమాన్. “సిఐడి”, “గైడ్”, “కాగజ్ కే పూల్”, “నీల్ కమల్’, ‘రంగ్ దే బసంతి’ లాంటి దాదాపు చిత్రాలలో విభిన్న పాత్రలు ధరించి జాతీయ నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు వహిదా. మన టాలీవుడ్ లో కూడా ‘రోజులు మారాయి’, ‘బంగారు కలలు’, సింహాసనం’ తో పాటు మొన్నటి ‘చుక్కల్లో చంద్రుడు’ సినిమా వరకూ ఆమె మన తెలుగు సినిమాలలో కూడా నటిస్తూనే ఉన్నారు.

ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వంలో 1962 లో ఆమె ‘అభిజాన్’ సినిమాలో నటించారు. ఇక విశేషం ఏమిటంటే ఎన్టిఆర్ నటించిన ‘జయసింహ’ చిత్రంలో వహిదా రెహమాన్ కు ప్రఖ్యాత నటిమణి షావుకారు జానకి డబ్బింగ్ చెప్పడం ఆరోజుల్లో టాలీవుడ్ లో సంచలనాత్మక వార్త. 

మరింత సమాచారం తెలుసుకోండి: