ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో ఆడియో వేడుకలు కుటుంబ బలప్రధర్శనలుగా జరుగుతున్నాయి. మెగా,నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, దగ్గుపాటి వారసుల సినిమాల ఆడియో వేడుకలు వారి శక్తి మేరకు ఎంత వరకూ ఘనంగా నిర్వహించాలో ఆ స్థాయిలో నిర్వహిస్తూ, ఆ కుటుంబాల ప్రాభవాన్ని వారి వారసులు చాటుతున్నారు. ఈ కుటుంబాలతో సంబంధం లేని మిగతా హీరోల ఆడియో వేడుకలు మాత్రం ఎంత ఘనంగా నిర్వహించినా సరైన అతిధులు రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. నిన్న రాజధాని లో జరిగిన “సింఘం” (యముడు-2) ఆడియో ఫంక్షన్ ఎంతో ఘనంగా నిర్వహించినా, మన టాలీవుడ్ పెద్దలు ఎవరూ లేకపోవడంతో బోసి పొయింది. ఈ సినిమా ఆడియో వేడుకలే కాదు చాలా సినిమాల ఆడియో వేడుకలు ప్రస్తుతం ఇలాగే జరుగుతున్నాయి.

మొన్నటి వరకూ ఏ ఆడియో వేడుక జరిగినా నేనున్నాను అంటూ వచ్చి తెలుగు పరిశ్రమపై రకరకాల కామెంట్స్ చేసే దాసరి ఈమధ్య జరిగిన సిబిఐ విచారణ వలన తను కూడా సినిమా వేడుకలకు రావడం పూర్తిగా మాని వేశారు. దాసరి కి ముందు చాలా సినిమాల ఆడియో వేడుకలకు అక్కినేని అతిధిగా వస్తూ ఉండేవారు. కాని ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యుల ఆడియో వేడుకలకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. రాజకీయాలలోకి చిరంజీవి రాకముందు చిరూ కూడా చాలా ఆడియో వేడుకలకు అతిధిగా రావడం జరిగేది. కాని చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళిపోయాక ఆయన బిజీ అయిపోవడంతో ఆయన సొంత వాళ్ళ ఆడియో ఫంక్షన్ లకే రాలేకపోతున్నారు. ఇలా ఎవరికి వారు దూరం అయిపోవడంతో టాలీవుడ్ ఆడియో ఫంక్షన్స్ సరైన అతిధులు లేక వెలవెలబోతున్నాయి. దీనికి ఉదాహరణ గా నిన్న జరిగిన “సింఘం” ఆడియో వేడుక, ఆమధ్య న జరిగిన కళ్యాణ్ రామ్ “ఓం” ఆడియో వేడుకలను పేర్కొనవచ్చు.

ఇదే కాకుండా మరో వింత సంస్కృతి మన టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తోంది. ఏ సినిమా ఫంక్షన్ కు అయినా కొంతమంది పెద్దలు గుంపుగా వచ్చి గుంపుగా వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకు రాఘవేంద్రరావు వస్తే రాజమౌళి, ఈయన వస్తే కీరవాణి, ఇలా లింక్ లు ఏర్పరచుకొని గుంపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆఖరుకు అల్లు బృందం కూడా అంతే. ఈ పరిస్థితులలను చూస్తున్న టాలీవుడ్ విశ్లేషకులు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ వేడుక జరిగినా ప్రముఖులు అంతా పెరంటంగా వచ్చి పెరంటంగా వెళ్ళిపోతున్నారని జోక్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: