2014 ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో చెప్పలేము కాని ప్రముఖ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి మటుకూ వైఎస్ఆర్ కుటుంబం పై ఒక సినిమాను తియ్యడానికి సిద్ధం అయి పోతున్నారు. గతంలో “బడిపంతులు”, “పాడిపంటలు” లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ రెడ్డి మనసు ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబం నేపధ్యంలో నిర్మాణం అవుతున్న “జగన్నాయకుడు” సినిమాపై పడింది. గతంలో దర్శకుడు పూరి జగన్నాధ్ వైఎస్ఆర్ జీవితంపై ఒక సినిమాను తీస్తానని ప్రకటించినా, అది కార్యరూపం దాల్చలేదు.

 వైఎస్ఆర్ కుటుంబంలోని ముడుతరాల ప్రతినిధులను అంటే రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి జీవితాలను అనుసంధానం చేస్తూ వాస్తవాలతో పాటు కొంత ఫిక్షన్ కూడా జోడించి ఈ కధను తయారు చేశారట. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే పి.అనంతపద్మనాభరెడ్డి ఈ సినిమా కధను తయారు చేశారని చెపుతున్నారు. ఇక ఈ సినిమాలో వైఎస్ఆర్ గా సుమన్, జగన్ గా హీరో రాజా, వైఎస్ఆర్ భార్య విజయలక్ష్మి గా ఆమని నటిస్తారట. రాజారెడ్డి, షర్మిల పాత్రలకు మటుకు నటీనటుల ఎంపిక జరగాల్సి ఉందని చెపుతున్నారు.

గతంలో భోగభాగ్యాలు అనే సినిమా తీసిన అనంతపద్మనాభారెడ్డి ఈ సినిమాను నాలుగు కోట్ల ఖర్చుతో తెరకు ఎక్కిస్తారని సమాచారం. ఒకవైపు టాలీవుడ్ లో కుటుంబ సినిమాల నిర్మాణం జరుగుతూ ఉంటే, మరోక వైపు మరోకొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ రాజకీయ కుటుంబ సినిమాగా ఈ “జగన్నాయకుడు” రూపొందబోతోంది. సామాన్యంగా రాజకీయ నేపధ్యం గల సినిమాలను పెద్దగా ఆదరించని మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను మరి ఎలా స్వగతిస్తారో చూడాలి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకొని రాబోతున్న ఎన్నికల ముందే వచ్చేస్తుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: