బాలీవుడ్ నటుడిగా ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న సంజయ్ దత్, ప్రస్తుతం పూణే లోని యరవాడ జైలు లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో విలాస వంతమైన జీవితాన్ని గడిపిన సంజయ్, ఎలా ఉన్నాడు..? అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. ప్రస్తుతం సంజయ్ దత్ కాగితాల సంచుల తయారీలో శిక్షణ పొందుతున్నాడట. అయితే నెల రోజుల శిక్షణ పొందుతున్నప్పటికి సంజయ్ ఒక్క కాగితపు సంచిని కూడా తయారు చెయ్యలేకపోతున్నాడని, ఈ బ్యాగ్ ల తయారీ చాలా సులభమని, సినిమాలలో ఎన్నో పెద్ద పెద్ద పాత్రలు చేసిన సంజయ్ దత్ కు ఈ సంచుల తయారీలో ప్రావీణ్యం సంపాదించడం కష్టం కాదని, అందుకే ఆయనకు ఈ సంచుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేశామని జైలు అధికారులు చెపుతున్నారట.

మొదటిలో సంజయ్ ను జైలు వంట శాలలో ఏదో ఒక తేలికపాటి పనిని అప్పగించాలని జైలు అధికారులు భావించినా, భద్రతా కారణాల రిత్యా సంజయ్ కు కాగితపు సంచుల తయారియే మంచిదనే ఉద్దేశంతో జైలు అధికారులు ఆయనకు ఆ పని అలవాటు చెయ్యడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారట. ఈపని కూడా ఆయనకు అలవాటు పడకపోతే పేపర్ బైండింగ్, ఫైల్స్ తయారి పనిని నేర్పించాలని ఆలోచనలో ఉన్నారట అక్కడి జైలు అధికారులు. గత నెల 16 తారిఖు నుండి జైలు జీవితం గడుపుతున్న సంజయ్ చాలా ముభావంగా ఉంటూ తరచూ పరధ్యానంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సంజయ్ తన జైలు జీవిత అనుభవాలను తన భార్య మాన్యత కు వివరిస్తూ ప్రతి రోజు ఒక సుదీర్ఘ లేఖ రాస్తున్నాడట. ఆ లేఖ కు మాన్యత కూడా సమాధానం ఇస్తూ సంజయ్ కు ధైర్యం నూరిపోస్తోంది అని అంటున్నారు.

ప్రస్తుతం సంజయ్ ని 16656 ఖైదీగా జైలు అధికారులు పరిగణిస్తూ ఆయన మనసు ప్రశాంతంగా ఉండడం కోసం చుట్టూ పచ్చటి చెట్లు ఉండే ఒక ఆహ్లాదకరమైన బ్యారక్ ను సంజయ్ జైలు గదిగా నిర్ణయి౦చామని జైలు అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం రోజు ఒక యుగంలా కాలాన్ని గడుపుతున్న సంజయ్ తన మనశ్శాంతి కోసం హనుమాన్ చాలీసా, భగవద్గీత పుస్తకాలు చదువుతూ రోజులు గడుపుతున్నాడట. ఒక సినిమాకు నాలుగు కోట్ల పైగా పారితోషికం తీసుకొని అత్యంత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సంజయ్ దత్ కు ఈ కొత్త జీవితం అలవాటు పడడానికి చాలాకాలం పట్టినా ఆశ్చర్యం లేదు.  
 
 
R

మరింత సమాచారం తెలుసుకోండి: