ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్నో కుటుంబాలకు పీడకలలా మిగిలిపోయిన ఉత్తరాఖండ్ విపత్తు మన రాష్ట్ర చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది. ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ 115 మంది జాడ లభించడం లేదని అధికారులు అంటున్నారు. ఈ వరద బీభత్సంలో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంత్రి గా ఎదిగిన సాక్షాత్తూ చిరంజీవి పిలుపు ఇచ్చినా తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి ప్రతి స్పందన లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరస్తోంది. టాలీవుడ్ కు సంబంధించి సెలబ్రిటీలుగా పేరుగాంచిన ఒక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లు మాత్రమే ఉత్తరాఖండ్ భాధితులకు సహాయాన్ని అందించిన వారిగా ఉన్నారు. కాని ఇందులో మహేష్ బాబు ఆర్ధిక సహాయం గురించి కూడా స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో టాలీవుడ్ ప్రిన్స్ ప్రధానమంత్రి సహాయనిధి కి తన విరాళాన్ని పంపాడా లేదా..? అనే రకరకాల సందేహాలు వస్తున్నాయి.

 ఇక వీరిద్దరు కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్ద హీరోలుగా పేరుగాంచిన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎన్టీఅర్, అల్లు అర్జున్, ప్రభాస్ లు ప్రస్తుతం తమ సినిమా షూటింగ్ ల నిమిత్తం చూపెడుతున్న శ్రద్ధలో కొద్దిపాటి శాతం కూడా ఈ ప్రకృతి విలయతాండవం వైపు చుపెట్టకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. అలాగే టాలీవుడ్ కు చెంది కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకొనే దర్శకులు వినాయక్, పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల, రాజమౌళి లాంటి వారు కూడా సాక్షాత్తూ చిరంజీవి యే పిలుపు ఇచ్చినా మౌనం వహించడం చూస్తూ ఉంటే సమాజంలో జరుగుతున్న సంఘటనల కన్నా తమ సినిమాల గురించి, తమ విలాసవంతమైన జీవితాల గురించి మాత్రమే మన సెలబ్రిటీలు పట్టించుకుంటారా..? అనే అనుమానం ఎవరికైనా కలుగుతోంది.

సినిమా ఆడియో వేడుకలకు, సినిమా హీరోల పుట్టిన రోజు వేడుకలకు లక్షాలాది రూపాయలను మంచినీళ్ళ లా ఖర్చు పెట్టె టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ బండ్ల గణేష్, దిల్ రాజు, బెల్లంకొండ సురేష్ లాంటి వాళ్ళు కూడా చిరంజీవి పిలుపు కు ప్రతిస్పందించకపోవడం చూస్తూ ఉంటే చిరంజీవి పిలుపు ను పెడచెవి పెట్టారా..? లేక సమాజం పట్ల తమ బాధ్యత లేదని ఈ సెలబ్రిటీలు అంతా అనుకుంటున్నారా..? అనే విషయం సినిమా అభిమానులకే కాదు సామాన్యులకు కూడా కలుగుతోంది. నిరంతరం తమ సినిమాలూ, ఓపెనింగ్ కలెక్షన్స్ గురించే కాకుండా మన తోటి వారి గురించి కూడా ఆలోచించే సంస్కారానికి మన సెలబ్రిటీలు ఎప్పుడు ఎదుగుతారో ఆ దేవుడికే తెలియాలి.  
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: