ఇండియన్ మైకేల్ జాక్సన్ గా ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన ప్రభుదేవా మోడరన్ డాన్స్ సామర్ధ్యం గురించి ఎవరూ నెగటివ్ గా చెప్పరు. డాన్సర్ గా ఒకమంచి ఇమేజ్ తెచ్చుకొని తరువాత దర్శకుడిగా మారి టాలీవుడ్ నుంచి మెగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభుదేవా. తరువాత బాలీవుడ్ కి నెమ్మదిగా ఎగబాకి అక్కడ కూడా రెండు మూడు హిట్లు కొట్టి తన స్టామినా ఏమిటో తేల్చిచెప్పాడు.

ప్రస్తుతం చాలా సినిమాలను బాలీవుడ్ లో డైరెక్ట్ చేస్తూ బిజీ గా ఉన్నాడు ప్రభుదేవా. ఇంతవరకూ బాగానే ఉంది కాని హటాత్తు గా ప్రభుదేవా దృష్టి మన పురాణాల పైకి ఎందుకు వెళ్లిందో అర్ధం కాదు. ఈమధ్య న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభుదేవా తనకు రామాయణాన్ని సినిమాగా తియ్యాలని కోరిక అంటూ తన విచిత్రమైన కోరికను వెల్లడించాడు ప్రభుదేవా.పూర్తి కమర్షియల్ డైరెక్టర్ గా అంతకన్నా మించి మంచి కొరియోగ్రాఫర్ గా పేరున్న ప్రభుదేవా కు మన భారతీయ సంస్కృతి కి అద్దం పట్టే రామాయణంపై ఎందుకు కన్ను పడిందో అర్ధం కాదు. కమర్షియల్ డైరెక్టర్ గా ప్రభుదేవా కు పేరుంది కాని క్రియేటివ్ డైరెక్టర్ గా మాత్రం కాదు. తెలుగులో, తమిళంలో హిట్ అయిన కొన్ని సినిమాలను కాపీ అండ్ పేస్ట్ లా బాలీవుడ్ లో సినిమాలుగా తీస్తూ అదృష్టం కొద్ది అవి హిట్ అవడంతో బాలీవుడ్ లో మంచి పేరున్న కమర్షియల్ డైరెక్టర్ గా పేరు పొందాడు ప్రభుదేవా. కాని విభిన్న పాత్రలూ, విభిన్న మనస్తత్వాలు కలిగిన మన పురాణాలను ముఖ్యంగా రామాయణం మహాభారతం లాంటి గ్రంధాలను సినిమాలుగా తియ్యడానికి ఎంతో నైపుణ్యం , మరెంతో రీసెర్చ్ వర్క్ చెయ్యగల సామర్ధ్యం ఉండాలి.

మన టాలీవుడ్ లో బాపు, కమలాకర్ కామేశ్వరరావు లాంటి హేమాహేమీలు పురాణాలను సినిమాలుగా తీసి విజయవంతం అయ్యారు. అదే విధంగా బాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖ దర్శకులు పురాణాలను సినిమాలుగా మార్చారు. అటువంటి స్థాయి మన వాడికి ఎక్కడ ఉంది.ఈ మాత్రం విషయ పరిజ్ఞానం కూడా ప్రభుదేవా కు తెలియదా అన్నదే ఆశ్చర్యం. తన మాజీ ప్రేయసి నయనతార బాపు ‘శ్రీ రామరాజ్యం’ లో సీతగా నటించి మెప్పించింది కాబట్టి తాను కూడా పురాణాలను ఎందుకు తియ్యలేను అనుకుంటున్నాడేమో మన ఇండియన్ మైకేల్ జాక్సన్.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: