‘బాహుబలి 2’ తరువాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలో హీరోగా నటించే అవకాశం కోసం ఇప్పటికే అల్లుఅర్జున్ తన సర్వశక్తులు వినియోగిస్తూ రాజమౌళి పై వ్యూహాత్మకమైన ఒత్తిడి చేస్తున్నాడు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. అయితే రాజమౌళి మాత్రం తన తదుపరి సినిమా హీరో విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తూ సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు. 

ఈ నేపధ్యంలో రాజమౌళి అల్లుఅర్జున్ పై ఈమధ్య బహిరంగంగా కురిపించిన ప్రశంసలు వెనుక ఆంతర్యం ఏమిటి అన్న చర్చలు ప్రస్తుతం ఫిలింనగర్ లో జరుగుతున్నాయి. ఇక వివరాలలోకి వెళితే ట్రాఫిక్‌ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు హైద్రాబాద్‌ పోలీసు విభాగం పలువురు సినీ ప్రముఖులతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌తోపాటు రాజమౌళి కూడా హాజరయ్యాడు.

ఈ సమావేశంలో మాట్లాడిన అల్లుఅర్జున్ ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడపడంలో హీరోయిజం ఉండదని అభిప్రాయపడుతూ పెద్ద సందేసమే ఇచ్చాడు. సినిమా వేరు, రియల్‌ లైఫ్‌ వేరు అన్న విషయం నేటి యూత్ తెలుసుకోవాలి అంటూ తనకు 19 ఏళ్ళ వయసులో ఉన్నపుడు తాను ఒక పార్టీకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో అతివేగంగా తాను కారును డ్రైవ్ చేస్తూ తన ముందు ఉన్న ఒక పెద్దాయనకు సంబంధించిన కారుకు డాష్ ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

అయితే తన పొరపాటును గ్రహించి తాను కారు డ్రైవింగ్ సీట్ లో ఉన్న పెద్దాయన వద్దకు వెళ్ళి తన తప్పు ఒప్పుకుని సారీ చెప్పానని, కారుకు ఎంతయితే అంత బాగు చేయించి ఇస్తానని చెప్పినట్లుగా తెలిపాడు. అయితే అదే కారు నుండి  వెనుక సీట్ లో నుండి డోర్ ఓపెన్ చేసుకుని గర్భిణితో ఉన్న మహిళ కిందకి దిగిందని, ఆమె తనను ఏమీ అనకపోయినా ఆమె తన వంక చూసిన చూపులు తనను కదిలించాయని, ఆ సంఘటన తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని చెపుతూ  ‘డ్రైవ్ చేసేటప్పుడు మన జీవితం కాదు, మరొకరి జీవితం మన డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుందని’ అల్లుఅర్జున్ ఉద్వేగభరితంగా చెప్పిన కొటేషన్ కు ఆ సమావేశానికి వచ్చిన అతిధుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇదే సమావేశంలో పాల్గొన్న రాజమౌళి తన మొదటి మాటలతోనే బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను బన్నీలా బాగా మాట్లాడలేను కాబట్టే బాగా మాట్లాడే బన్నీ లాంటి టాప్ హీరోలతో సినిమాలు తీస్తూ ఉంటాను అని కామెంట్ చేసాడు రాజమౌళి. దీనితో రాజమౌళి నోటివెంట బన్నీ ప్రశంసలు విన్న మీడియా వర్గాలు జక్కన్న ప్రశంసలు దేనికి తార్కాణం అంటూ తమలో తాము గుసగుసలు ఆడుకున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: