టాప్ హీరోల సినిమాల బడ్జెట్ పెరిగి పోవడంతో ఆసినిమా పై పెట్టిన ఖర్చును కేవలం మొదటి వారం సినిమా కలక్షన్స్ రూపంలో రాబట్టడానికి నిర్మాతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం యువతరం పై సోషల్ మీడియా ప్రభావం చాల ఎక్కువగా ఉన్న నేపధ్యంలో యూత్ అంతా బయట మాట్లాడుకోవడం మానివేసి కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. 

ప్రస్తుతం చాలామంది జీవితాలలో ప్రధాన పాత్రను పోషిస్తున్న ట్విట్టర్ ఫేస్ బుక్ ల ఆగమనంతో నెటిజన్లు ఎక్కువగా మాటల్లో కంటే బొమ్మలతో మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు యాహూ మెయిల్ ఆర్కూట్ లలో ఎమోట్ ఐకాన్స్ ఉండేవి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు వాట్సాప్ లో ఉన్న ఎమోటైకాన్స్ క్లిక్ అయ్యాయి. 

దీనితో ఈ పోటీని తట్టుకోవడానికి ట్విట్టర్ తన మార్కెటింగ్ ప్లాన్స్ ను కూడ మార్చుకుంది. ట్విటర్ లో కొత్తకొత్త బొమ్మలను రకరకాల ఎమోజీలుగా దించుతున్నారు. దీనితో ఈ విషయం పై కూడ మన ఇండియన్ టాప్ హీరోల దృష్టి పడింది. ఆమధ్య ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఏకంగా తన బొమ్మనే ఒక ఎమోజీగా రూపొందించి రిలీజ్ చేయించాడు.

ఇప్పుడు అదే పద్ధతిని కోలీవుడ్ టాప్ హీరో విజయ్ కూడ అనుసరిస్తూ తన లేటెస్ట్ మూవీ మెరిసాల్ తెలుగులో ‘అదిరింది’ అనే పేరుతో డబ్ చేస్తున్న సినిమాకు సంబంధించి నిన్న ఒక ఎమోజి విడుదల చేసారు. కోలీవుడ్ లో ప్రస్తుతం ఆ ఎమోజి అక్కడ యూత్ ను బాగా ఆకర్షిస్తోంది. 

ఇదే తరహాలో జూనియర్ కూడ తన 'జై లవ కుశ' సినిమాలోని మూడు క్యారక్టర్లనూ మూడు రకాల ఎమోజీలుగా రిలీజ్ చేయిస్తున్నాడట. దీని కోసం అయ్యే ఖర్చు 50 లక్షలుఅని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో యూత్ సోషల్ మీడియాలో ఛాటింగ్ చేస్తున్నప్పుడు రకరకాల ఎమోజీలు పెడుతున్నారు. అలాంటి ఎమోజిలలో జూనియర్ ‘జై లవ కుశ’ కూడ ఉంటే దాని రేంజ్ వేరుగా ఉంటుందని నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే ప్రయత్నాన్ని మహేష్ తన ‘స్పైడర్’ కోసం చేసినా ఆశ్చర్యం లేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: