పవన్ కళ్యాణ్ తన ట్విటర్ లో చాల అరుదుగా మాత్రమే స్పందిస్తూ ఉంటాడు. ఎన్నో సామాజిక సమస్యలు మరెన్నో వివాదాలు ప్రతిరోజు హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నా కొన్ని విషయాల పై మాత్రమే పవన్ తన స్పందన తెలియచేస్తాడు. ముఖ్యంగా తాను నటించే సినిమాల గురించి ఎప్పుడు పవన్ ఒక్కమాట కూడ తన ట్విటర్ ద్వారా స్పందించడు. 

పవన్ ‘జనసేన’ పార్టీ పెట్టిన తరువాత సోషల్ మీడియా ద్వారా కొన్నికొన్ని అంశాల పై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ మీడియాకు తరుచు హాట్ టాపిక్ గా మారుతున్నాడు. దీనితో పవన్ కళ్యాణ్ తన ట్విటర్ లో ఏమి చెప్పినా అది సంచలనమే అవుతోంది. ఈ నేపధ్యంలో పవన్ ట్విటర్ ఎకౌంట్ కు 20 లక్షల మంది ఫాలోయర్స్ ఏర్పడటంతో పాటు వారంతా పవన్ సైనికులుగా మారడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ ఒక భావయుక్తమైన ట్విట్ చేసాడు. 

‘ముూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలుపెట్టినపుడు.. దారంతా గోతులు.. చేతిలో దీపం లేదు.. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టాను. నేను స్పందించిన ప్రతీ సమస్యకు మేమున్నామంటూ ప్రతిస్పందించి ఈ రోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా  వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలతో - మీ పవన్ కళ్యాణ్’ అంటూ ట్వీట్ చేశాడు పవన్. 

ప్రస్తుతం ఈ ట్విట్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తూ షోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే పవన్ చెపుతున్న ఈ 20 లక్షల దీపాలు ‘జనసేన’ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంత వరకు సరిపోతారు అన్న ప్రశ్నలు ఉన్నా పవన్ మాటలను అభిమానించే వారి సంఖ్య 20 లక్షలు దాటడం పవన్ అభిమానులు పండుగ చేసుకునే విషయమే. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో ‘జనసేన’ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గుంటూరు, ఏలూరులలో ఔత్సాహిక వేదికలు నిర్వహిస్తు పవన్ తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికీ మన దేశ ఎన్నికలను గ్రామీణ ప్రాంత ఓటర్లు బాగా ప్రభావితం చేస్తున్న నేపధ్యంలో కేవలం సోషల్ మీడియాలో పవన్ చెప్పే మాటలు విని గ్రామీణ ప్రాంతంలోని ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న నిరక్షరాస్యులు పవన్ మాటలు నమ్మి ఎంత వరకు నమ్మి ఓటు వేస్తారు అన్నదే సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: