నిన్న జరిగిన ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ వీరాభిమానులు చేసిన వీరంగాన్ని చూసి వీరిపై పవన్ అభిమానుల ప్రభావం పడిందా అన్న కామెంట్స్ వినిపించాయి. సర్వసాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో పవన్ పేరు తప్ప మరే పేరు వినిపించదు.

అంతేకాదు ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులను కూడ ఏమి మాట్లాడనివ్వకుండా పవన్ నామస్మరణతో ఆడిటోరియంను హోరేత్తిస్తారు పవన్ అభిమానులు ఇప్పుడు అదే పరిస్థితి నిన్న జరిగిన ‘స్పైడర్’ ఫంక్షన్ లో కూడ కనిపించింది. ఈసినిమాలో నెగిటివ్ పాత్ర చేసిన ఎస్.జె.సూర్య మాట్లాడటానికి మైక్ ముందుకు వచ్చినప్పుడు మహేష్ అభిమానులు అతడి స్పీచ్ వినిపించకుండా విపరీతంగా అడ్డు తగిలారు.

తాను మహేష్ గురించి ‘స్పైడర్’ గురించి చెపుతున్నాను అంటూ పలుమార్లు చెప్పినా మహేష్ అభిమానులు ఏమాత్రం వినిపించుకోకుండా గట్టిగా మహేష్ నామస్మరణ చేసారు. దీనితో ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న సుమ మైక్ తీసుకుని ఎస్.జె.సూర్యాను మాట్లడనీయవలసిందిగా పలు మార్లు అభ్యర్ధించ వలసి వచ్చింది.

ఇదే సంఘటన మహేష్ బావ సుధీర్ బాబు మాట్లాడుతున్నప్పుడు కూడ జరిగింది. జరుగుతున్న ఈ తతంగాన్ని చూస్తున్న మహేష్ తన అభిమానులను ఏమి అనలేక అదేవిధంగా అతిధులు పడుతున్న కష్టాన్ని చూసి కొద్ది సేపు అసహనానికి లోనైట్లుగా తెలుస్తోంది. దీనితో మహేష్ అభిమానుల పై పవన్ అభిమానుల ప్రభావం పడిందా అంటూ ‘స్పైడర్’ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: