ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రంగం సిద్దం కావడంతో ఈ ప్రభావం టాలీవుడ్ రంగంపై పడేలా కనిపిస్తోంది. కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబందించి 60 మంది దాక నిర్మాతలు ఉండటంతో వీరందరినీ కలుపుకుంటూ ‘తెలంగాణ సినిమా ఫోర్స్’ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలోని నిర్మాతలకు నటీనటులకు, టెక్నీషియన్స్ కు, సినిమా కార్మికులకు వేదికగా తీసుకురావడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు గా తెలుస్తోంది. ఈ ప్రక్రియకు ‘జైబోలో తెలంగాణ’ సినిమా తీసిన ఎన్. శంకర్ ‘కొమరం భీమ్’ లాంటి సినిమా తీసిన అల్లాణి శ్రీధర్ తో పాటు డాక్టర్. శ్రీనాద్, ప్రేమ్ రాజులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఇప్పటికే ప్రారంభమై 600 మంది సబ్యులు గల తెలంగాణ ఫిలిం చాంబర్ ను మరింత పటిష్టం చేసి ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ కన్నా పెద్ద సంస్థగా తీర్చి దిద్దే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించేసారు ని అంటున్నారు. అంతేకాకుండా చిన్న సినిమాలకూ, ప్రయోగాత్మ సినిమాలకు ప్రోత్సాహం కలిపించే విధంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇది వరలో వచ్చిన ‘మాభూమి’, ‘దాసి’ లాంటి మంచి సినిమాలను నిర్మించే నిర్మాతలను ప్రోత్సహించే బాధ్యత ఈ కార్పోరేషన్ కు అప్పచేపుతారట. అదేవిదంగా పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాయిలో తెలంగాణ ఫిలిం ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలోని కొత్త నటీనటులకు అవకాశాలు కలుగాచేస్తారట. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం నుండి వచ్చి టాలీవుడ్ లో ప్రముఖ నటులుగా ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో నితిన్, శ్రీహరి, వేణు మాధవ్ లాంటి వ్యక్తుల సహకారం కూడా తీసుకుంటారట.

తెలుగు సినిమా అంటే ప్రేక్షకులకు చూపించే సంక్రాంతి బోగి మంటలకు బదులు భవిష్యత్ లో బోనాలు, బతుకమ్మ పండుగలను చూపెడతామని చెపుతున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి టాలీవుడ్ కూడా రెండు ముక్కలు గా విడిపోయి తెలంగాణ సినిమా, ఆంధ్రా సినిమా అనే భాగాలుగ మారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు...  

మరింత సమాచారం తెలుసుకోండి: