ప్రతి ఏటా పార్వతీ దేవి కైలాసం నుండి తన పుట్టిల్లు భూలోకానికి పసుపు కుంకుమలు తీసుకువెళ్ళడానికి వస్తుందని, ఆమెను ఆ సందర్భంలో మళ్ళీ కైలాసానికి పిలుచుకు వెళ్లేందుకై ఆమె కుమారుడు గణపతి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు భూలోకానికి వస్తాడని, ఆ శుభ తిధినే వినాయక చవితి గా జరుపుకోవడం ఆచారం అయిందని మన ఆర్య ఋషులు అంటారు. హిందు మతంలో వినాయక చవితి కి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. వేదం ఎంత ప్రాచీనం అయిందో వినాయక శబ్దం కూడా అంత ప్రాచీనం అంటారు. చతుర్వేదాలలో గణపతి శబ్దం వినిపిస్తుంది. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి, ఏకదంతుడు, గజాననుడు అనే పేర్లతో ఏ శుభాకార్యంలో అయినా ఈయన తొలి పూజలు అందుకుంటాడు. వినాయకుని రూపం, గుణం బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేహ ఆరోగ్యం, బుద్ధి బలం, మనశ్శాంతి, చిత్తశుద్ధి, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ గణపతి ఆరాధన ద్వారానే వస్తాయని మన పెద్దలు అంటారు.

మన౦ చేప్పట్టే ప్రతీ పనికీ ముందు మన౦ విఘ్నేశ్వరుని పూజిస్తాం. ఆయనను ఆరాధిస్తే ఎటువంటి విగ్నాలు ఉండవనేది మన నమ్మకం. దీనికి కారణం విశ్వంలోని అన్ని శక్తులు ఆయన ఆధీనంలో పనిచేస్తాయి అని మన వేదాలు అంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విఘ్నేశ్వరుడు మహా విద్వాంసుడు. “ఓం” అనే అక్షరాన్ని అడ్డంగా తిప్పి చూస్తే ఏనుగు కుంభ స్థలంగాను, వేలాడుతున్న వక్రతుండంగాను కనిపిస్తుంది అని అంటారు. అంతేకాదు వినాయకుడి ఆకారం నీతి బోధకంగా ఉంటుంది. ఆయన ఒక్కొక్క అవయవం ఒక్కో తత్వానికి సంకేతం. అంతటి భారీ శరీరం తో ఉండే వినాయకుడికి చిట్టి ఎలుక వాహనంగా ఉండడం ఎలుక తెలివికి సంకేతం అంటారు. వినాయకుడి గొప్పతనాన్ని వివరించే ఎన్నో కధలు మన పురాణాలలో ప్రచారం గా ఉన్నాయి. అందులో అత్యంత ప్రముఖమైన వినాయకుడు చంద్రుడికి శాపం ఇచ్చే కధను మనం పఠీ౦చకుండా వినాయక చవితి నాడు వినాయకుడి పూజ పూర్తి కాదు.

గణపతి కి నాలుగు చేతులు ఉన్నట్లు వర్ణిస్తారు. అలాగే 6,8,10,16 చేతులున్న వినాయకుడి ప్రతిమలు కూడా మనకు చాలాచోట్ల కనిపిస్తాయి. వినాయకుడి తొండం వంకర గా కుడి పక్కకో ఎడమ పక్కకో వంపు తిరిగి ఉంటుంది. అలాగే ఆయన నిలుచునే విధానంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఈ తీరులు అన్నింటికీ మన పురాణాలలో, వేదాలలో రకరకాల కారణాలు చెపుతారు. ఉత్తర భారతదేశం కన్నా దక్షిణ భారతదేశంలోనే గణపతి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలతో పాటు ముంబాయి లో ఈ గణపతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇక మన భాగ్యనగరం హైదరాబాద్ లో అయితే ఈ వినాయక చవితి ఉత్సవ శోభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేలాది గణపతి విగ్రహాలు భాగ్యనగరం అంతా వెలవడమే కాకుండా గణపతి చేతిలో ఉంచుకున్న లడ్డూ ను కూడా లక్షలాది రూపాయిలకు వేలంపాటలో కొనుక్కొని మురిసిపోతూ ఉంటారు మన భాగ్యనగర వాసులు. ముల్లోక వాసులకు ముఖ్య దైవం అయిన గణనాధుడు క్రమం తప్పకుండా ఈరోజు ఉదయం భాద్రపద శుద్ధ చవితి ఉషోదయాన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన 10 కోట్ల మంది ఆంధ్రుల లోగిళ్ళలోకి వచ్చేస్తున్నాడు.

తెలుగు జాతి నేడు ఉన్నంత అశాంతిగా చరిత్రలో మరెప్పుడూ లేదేమో అనిపించేటట్లుగా రాజకీయ ఉద్యమాలు నడుస్తున్న నేటి వర్తమానంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను మన గణనాధుడు మనకు కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆ తొలి దైవం విఘ్న నాయకుడు గణపతి కి సాదరంగా ఆహ్వానం పలుకుదాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: