కొందరుంటారు. ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తుంటారు. లేచి నిలబడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మెహర్ రమేశ్ కాస్త డిఫరెంట్. ఈయనగారు పడతాడు. మళ్లీ లేస్తాడు కూడా. కానీ నిలబడడు. మళ్లీ పడటానికే లేచాను అని నిరూపించుకుంటాడు. డిజాస్టర్లు తీసి, హీరోల ఇమేజులతో ఆడుకోవడం ఈయనకు కెమెరాతో పెట్టిన విద్య. అయినా కూడా ఫీలవడు. మళ్లీ ఎవరికి డిజాస్టర్ ఇద్దామా అన్నట్టుగా తిరుగుతుంటాడు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు.

ఈ మధ్య మెహర్ రమేశ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఆఫీసుల, ఇంటి పరసరాల్లోనే కనబడుతున్నాడని సమాచారం. పవన్ కళ్యాణ్ ని ఓసారి కలవాలంటూ తెగ పడిగాపులు పడుతున్నాడట. ఇప్పటికి ఓ ఆరేడు సార్లు వెళ్లాడట. కానీ పవన్ బిజీగా ఉండటంతో టైమ్ ఇవ్వలేకపోయాడట. అయినా కూడా అతగాడిని కలిసే వరకూ వదిలేది లేదని కంకణం కట్టుకున్నాడట మెహర్. ఇదంతా ఎందుకు అంటే... మన డ్యామేజింగ్ డైరెక్టర్ గారు తన తర్వాతి సినిమా పవన్ తో తీసెయ్యాలని డిసైడ్ అయిపోయాడు మరి. అతడి కోసం ఓ మంచి కథ సిద్ధం చేసేశాడట.

పవన్ ఎస్ అనేస్తే వెంటనే పని మొదలెట్టేసి, అద్భుతంగా తీసేస్తానని అంటున్నాడు. ఈ విషయం వినగానే పవన్ ఫ్యాన్స్ గుండె జారిపోయింది. జారిపోక ఏమవుతుంది! హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోకుండా, కథలో ఎంత బలముందో తెలుసుకోకుండా, గుడ్డిగా అడుగేసే టాలెంట్ మెహర్ రమేశ్ కి మాత్రమే ఉంది. లేకపోతే వెంకటేష్ లాంటి సాఫ్ట్ హీరోతో షాడో సినిమా తీస్తాడా! ఆ సాహసం అతడు తప్ప మరెవరైనా చేయగలరా చెప్పండి! కేవలం హింసను నమ్ముకుని, తెరమీద రక్తాలు పారించేసి కాసులు మూటగట్టేసుకుందామంటే అయ్యే పని కాదు. ఆ విషయం అన్ని డిజాస్టర్లను తీసిన తర్వాత కూడా మెహర్ కి అర్థం కాలేదు. ఇప్పుడు పవన్ కి ఎక్కడ ఎసరు పెట్టేస్తాడో, అసలే మంచోడైన పవన్ ఏ సెంటిమెంటుకో లొంగిపోయి ఎస్ అంటే ఏంటి పరిస్థితి అని అభిమానులు వణికిపోతున్నారు. మెహర్ బారి నుండి పవన్ ను ఎవరు కాపాడతారో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: