అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్లుగా గత రెండు నెలలుగా ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాని టాలీవుడ్ లో ఒకేసారి రెండు సినిమాలు దసరాకు సందడి చేస్తాయి అంటూ నిన్న అటు అత్తారింటికి దారేది ఇటు రామయ్యా వస్తావయ్యా నిర్మాతలు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధియేటర్ యజమానులను అయోమయంలో పడవేశారు. అక్టోబర్ 9 న పవన్ వస్తే, అక్టోబర్ 10 న జూనియర్ వస్తాడట. సంక్రాంతి సినిమా పండుగలా ఒక భారీ సినిమాపై మరో భారీ సినిమా పోటీ పడడం వినడానికి బాగానే ఉంది కాని ఇది వాస్తవికంగా జరిగే పని యేనా..? అంటూ మాటలు వినిపిస్తున్నాయి.

ఇలా రెండు భారీ సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ జరగాలి అంటే కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 2000 థియేటర్స్ కావాలి. ఎందుకంటే అటు పవన్ కాని, ఇటు జూనియర్ కాని 1000 థియేటర్స్ లోపు తమ సినిమాలను విడుదల చెయ్యడానికి ఒప్పుకోరు. వారు ఒప్పుకున్నా ఈ సినిమాలను కోట్లు పెట్టి కొనుక్కున్న బయ్యర్లు ఒప్పుకోరు. ప్రస్తుతం మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నవి 1600 థియేటర్స్ మాత్రమే అన్న విషయం సినిమాలు తీసే వారందరికీ తెలుసు. అంటే పోటీ గా విడుదల అవుతున్న ఈ రెండు సినిమాలలో ఒక సినిమాకు 400 థియేటర్స్ కోత పడుతుంది. ఇంకా కాగడా వేసి పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్త థియేటర్స్ ను లెక్కలోకి వేసుకున్నా అవి కూడా 200 మించి లేవు. ఇటువంటి పరిస్థితులలో ఒకేసారి రెండు భారీ సినిమాలు టాలీవుడ్ లో ఎలా విడుదల అవుతాయి అంటూ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.

పవన్, జూనియర్ లు నటించిన భారీ సినిమాల బయ్యర్ల దగ్గర నుంచి ఈ సినిమాల విడుదల పై ఒత్తిడి లేకుండా ఒక వ్యుహత్మకమైన ప్లాన్ తో అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా సినిమాల నిర్మాతలు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నట్లు రిలీజ్ డేట్స్ ప్రకటించారు కాని వాస్తవానికి అది జరగదని, అదీకాకుండా సంక్రాంతి మార్కెట్ కు, దసరా మార్కెట్ కు చాలా తేడా ఉందని, అందువల్ల పవన్, జూనియర్ లు దసరా పండుగకు డీ కొడతారు అనుకోవడం ఉహ మాత్రమే అంటూ చివరి నిమిషంలో పవన్, జూనియర్ ల సినిమాలలో ఒక సినిమా వెనుకకు తగ్గడం ఖాయం అనేమాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. ఇంతకీ పవన్ – జూనియర్ ల మధ్య ఎవరు వెనుక అడుగు వేస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: