మెగా స్టార్ కొడుకు, తండ్రి ఫ్యాన్స్ అందరినీ వెనక ఉంచుకుని ఇండస్ట్రీలోకి ఎంటరైనవాడు, అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నవాడు, మగధీర లాంటి అద్భుతమైన చిత్రంలో నటించినవాడు... ఇన్ని ప్లస్సులు ఉన్నా రామ్ చరణ కెరీర్ ఎందుకు కుంటుంతోంది? ఈ ప్రశ్నకు రామ్ చరణ్ దగ్గర సమాధానం ఉందో లేదో తెలీదు కానీ... జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు సమాధానం దొరికేస్తుంది.

తుఫాన్ సినిమాతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు రామ్ చరణ్. ఎంతగా డిప్రెస్ అయ్యాడంటే... తన మీద ఉన్న కేసును కొట్టేసినా మనసారా ఆనంద పడలేనంత. రోడ్డు మీద ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మీద దాడి చేసిన కేసులో రామ్ చరణ్ మీద పెట్టిన కేసు వీగిపోయింది. సాక్ష్యాలు లేవంటూ కేసును కొట్టేశారు. ఇది శుభవార్తే అయినా చెర్రీలో ఎలాంటి ఆనందం కనిపించలేదు. ఎందుకు అని అడగక్కర్లేదు. కెరీర్ ఏమైపోతుందో అని అతడు పడుతోన్న టెన్షన్ ముందు ఈ ఆనందం చాలా చిన్నది. అందుకే అతడు నవ్వలేదు. చక్కగా, ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా సాగిపోతున్న కెరీర్లో తానతంతట తానే తుఫాన్ సృష్టించుకున్నాడు చెర్రీ. బాలీవుడ్లో ఎంటరవ్వాలనుకోవడంలో తప్పు లేదు. దానికి అతడికి చాలా మార్గాలున్నాయి. కావాలంటే తన ఇమేజ్ కు తగ్గ కథలు బోలెడన్ని దొరకుతాయి. అవన్నీ వదిలేసి పోయి పోయి అమితాబ్ సినిమా రీమేక్ ని ఎంచుకున్నాడు. దెబ్బ తిన్నాడు. ఇది అతడి స్వయంకృతాపరాధం. 

అయితే తప్పు జరిగిపోయింది. దాన్ని సరిదిద్దుకుని, ఇప్పుడైనా సరైన అడుగులు వేయాలి కదా! అది మానేసి విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఎవడు సినిమాని వంశీ పైడిపల్లి ఏదో చేసేశాడని, మళ్లీ రీషూట్ చేస్తున్నారని, ఇప్పుడప్పుడే రిలీజ్ కాదని అంటున్నారు. తర్వాత చేయబోయే సినిమాలయినా పక్కాగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి కదా! కృష్ణవంశీతో చేయడానికి సై అన్నాడు. ఏ ధైర్యంతో అతడితో చేస్తానన్నాడు! కేవీ హిట్ ముఖం చూసి ఎన్నాళ్లయ్యింది? పైగా అతడి సినిమా స్టయిల్ ఎలా ఉంటుంది? రామ్ చరణ్ అతడి ఫ్రేములో ఫిట్ అవుతాడా? ఇవేమీ ఆలోచించకుండా ఎస్ అన్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఇది కాక మిస్టర్ నూకయ్య దర్శకుడు అనిల్ దర్శకత్వంలో నటించబోతున్నట్టు తెలిసింది. అన్నదమ్ములుగా డ్యూయెల్ రోల్ చేస్తాడట. పైగా ఇది పొలిటికల్ టచ్ ఉన్న కథ అట. చిరంజీవి పొలిటీషియన్ కావడం వల్లే కదా వీళ్ల సినిమాలు ఆగిపోయాయి? వాళ్ల మీద అలాంటి ఇంప్రెషన్ ఉన్నప్పుడు, పాలిటిక్స్ జోలికి పోయి, జనంతో చీవాట్లు తిని, సినిమాకి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకట! పైగా ఇప్పుడున్న పరిస్థితులో తనకో పెద్ద డైరెక్టర్ సపోర్ట్ అవసరం. స్టార్ డైరెక్టర్ తో చేస్తేనే డౌన్ అవుతోన్న ఇమేజ్ కాస్తయినా నిలబడుతుంది. అది ఆలోచించకుండా చిన్న దర్శకుడికి ఎస్ చెప్పడం ఏమిటి? ఇవన్నీ చూస్తుంటే... చెర్రీకి కెరీర్ మీద సరయిన ప్లానింగ్ లేదని తెలుస్తోంది. పడటం ఇండస్ట్రీలో మామూలే. కానీ పడి లేవడం మాత్రం అందరికీ చేతకాదు. లేచినవాడే గెలుస్తాడు. లేవడం చేతకానివాడు నామరూపాలు లేకుండా పోతాడు. ఈ విషయం తన తండ్రిని చూసయినా చెర్రీ తెలుసుకుని ఉండాలి. మళ్లీ నిలబడటానికి సరయిన ప్లానింగ్ తో అడుగులు వేస్తే చెర్రీకి వచ్చిన సమస్యేమీ లేదు. కానీ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని ఏది పడితే అది చేస్తే... తుఫాన్ మిగిల్చిన కాస్తంత ఇమేజ్ సునామీ వేగంతో కొట్టుకుపోతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: