మోహన్ బాబు లాంటి వెర్సటైల్ నటుడి కొడుకై ఉండి కూడా, సక్సెస్ ముఖం చూడ్డానికి చాన్నాళ్లు పట్టింది విష్ణుకి. పాత్రల ఎంపికలో లోపంతో పాటు, నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకోలేకపోవడంతో ఢీ సినిమా వచ్చేవరకూ అతడిని హీరోగానే గుర్తించలేదు మనవాళ్లు. అయితే ఆ తర్వాత కూడా నొప్పులు పడక తప్పలేదు మనోడికి. మళ్లీ దేనికైనా రెడీ విడుదలయ్యే వరకూ పరాజయాల వెంట పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఆ సినిమా కాస్త ఊరట కలిగించేసరికి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది మంచు బాబుకి!

విష్ణు నటిస్తోన్న దూసుకెళ్తా సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. వీరుపోట్ల దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రెయిలర్ అందరినీ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా హిట్టు అని ఫిక్సయిపోయిన విష్ణు, తన తరువాతి సినిమాగా అసెంబ్లీ రౌడీని ఎంచుకున్నాడు. ఇది మోహన్ బాబు ఫ్యాన్స్ ని కాస్త ఉలిక్కిపడేలానే చేసింది. డైలాగ్ కింగ్ కెరీర్లో అతి పెద్ద విజయాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. మాస్, యాక్షన్ హీరోగా అతడిని పది మెట్లు పైకి ఎక్కించిందీ సినిమా. అలాంటి సినిమాని విష్ణు ఎందుకు రీమేక్ చేయాలనుకుంటున్నాడు అంటూ కొందరు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు.

ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ చేయడానికి ఒప్పుకున్నాడు. అయినా కూడా ఈ రీమేక్ ను ఎవరూ స్వాగతించడం లేదనే చెప్పాలి. విష్ణు బాగానే నటిస్తాడు. కానీ మోహన్ బాబు అంత బాగా మాత్రం కాదు. పవర్ ఫుల్ గా డైలాగులను చెప్పలేడు. అతడి మాటే ముద్దగా ఉంటుంది. పైగా స సరిగ్గా పలకదు. తన తండ్రిలో ఉండేంత ఈజ్, ఎనర్జీ కూడా విష్ణులో కనిపించవు. అందుకే అతడు ఆ సినిమాని బ్యాడ్ చేస్తాడేమోనని భయపడుతున్నారు మంచు ఫ్యాన్స్. కానీ విష్ణు మాత్రం రీమేక్ చేసి తీరతానని అంటున్నాడు. తండ్రి చేసిన పాత్రను చేయాలని ఆశపడటంలో తప్పు లేదు. కానీ తేడా వస్తే తనతో పాటు తండ్రికి కూడా బ్యాడ్ అయిపోతుందని విష్ణు గుర్తు పెట్టుకుంటే మంచిది!

మరింత సమాచారం తెలుసుకోండి: