ఇద్దరమ్మాయిలతో సినిమాలో క్యాథరీన్ ని చూసి కుర్రకారు మనసులు పారేసుకున్నారు. కానీ పాపం, ఆ తరువాత ఎవరూ పట్టించుకోలేదు పిల్లను. నానితో పైసా చిత్రంలో నటించింది కానీ ఆ సినిమా విడుదలకే నోచుకోలేదు. దానితో పాటే క్యాథరీన్ అందాలు కూడా వెనకే ఉండిపోయాయి. అయితే ఇటీవలే ఓ తమిళ దర్శకుడు దయతలచి కార్తి పక్కన నటించే చాన్స్ ఇచ్చాడు క్యాథీకి. అప్పట్నుంచీ ఆనందంతో గంతులు వేస్తోంది. కదిపితే చాలు, గలగలా మాట్లాడేస్తోంది.

దుబాయ్ లో పుట్టి బెంగళూరులో చదువుకున్న ఈ పిల్లకి ఇంగ్లిష్, హిందీ, మలయాళ భాషలు బాగా వచ్చు. కానీ తెలుగు, తమిళం అంతగా రావు. ప్రస్తుతం ఆ రెండు భాషలతోనూ కుస్తీ పడుతున్నాడు అంటోంది క్యాథరీన్. ఎందుకలా అంటే... త్వరలోనే డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటోందట. అంత కంగారెందుకు, వేరేవాళ్లు చెబుతున్నారు కదా అంటే... అది నాకు నచ్చడం లేదు అంటూ మూతి ముప్ఫై వంకర్లు తిప్పుతోంది. నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి, అప్పుడే నేను పూర్తి స్థాయి నటినవుతాను, అందుకే భాష మీద శ్రద్ధ పెడుతున్నాను, త్వరలోనే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటాను అంటూ మంగమ్మ శపథం చేస్తోంది చేపకళ్ల సుందరి.

ఇప్పటికే కొందరు పరభాషా సుందరీమణులు డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. దానివల్ల వాళ్లు బాగానే సంబర పడుతున్నారు కానీ విన్నవాళ్లే చెవులు మూసుకుంటున్నారు. చార్మి ఒక్కదాని వాయిసే కాస్త బాగుంటుంది. అందుకే తనకే కాకుండా చందమామలో కాజల్ కి, మరికొన్ని సినిమాల్లో హీరోయిన్లకి కూడా డబ్బింగ్ చెప్పింది. జనం ఎంజాయ్ చేశారు. కానీ సొంత వాయిస్ అంటేనే భయపడేలా చేసినవాళ్లు కొందరున్నారు. మిస్టర్ పర్ ఫెక్ట్ లో ఫరవాలేదనిపించిన తాప్సీ, మొగుడు చిత్రంలో తన గొంతుతో గగ్గోలు పెట్టించింది. కర్ణ కఠోరంగా ఉన్న ఆమె స్వరాన్ని వినడం ప్రేక్షకుల వల్ల కాలేదు. విజయశాంతి లాంటి సీనియర్ నటీమణి గొంతునే వినలేకపోయిన ప్రేక్షకులు వీళ్లందరి గరగరలనూ ఎక్కడ భరించగలరు! కాబట్టి అనవసరమైన ప్రయోగాలు చేయకు క్యాథరీన్. చక్కగా ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించుకో... నీకు కంఠశోష, ప్రేక్షకులకు శ్రవణ ఘోష తప్పుతుంది!



మరింత సమాచారం తెలుసుకోండి: