‘జంజీర్’ సినిమా ఫ్లాప్ తో కొద్దిగా నిరాశగా ఉన్న రామ్ చరణ్ తో నటించడానికి ఓ సూపర్ స్టార్ నో చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరు..? అని మీకు అనిపిస్తోంది కదూ..! కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక మల్టీ స్టారర్ సినిమా చెయ్యడానికి పచ్చజెండా ఊపాడు అనే వార్తలు ఈ మధ్య కాలంలో చాలాచోట్ల వినిపిస్తున్నాయి. అయితే ఈ మల్టీ స్టారర్ సినిమా కధలో చెర్రీ తో పాటు హీరో విక్టరీ వెంకటేష్ అలాగే ఒకనాటి సూపర్ స్టార్ కృష్ణ నటించబోతున్నారు అంటూ ఆ మధ్య తెగ వార్తలు వచ్చాయి. తెలుగు సినిమా రంగంలో చాలామంది హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు నటించిన రికార్డు సూపర్ స్టార్ కృష్ణ ది. హీరో మహేష్ బాబు టాలీవుడ్ ప్రిన్స్ గా మారిపోయిన తరువాత కృష్ణ తన సినిమాలను  ఇంచుమించుగా పూర్తిగా తగ్గించేసుకున్నారు. కాని అప్పుడప్పుడు చిన్న చిన్న అతిధి పాత్రలో కనిపిస్తూ మెరవడం కృష్ణ కు అలవాటు.

ఆ అలవాటు రిత్యానే కృష్ణ ను ఈ మల్టీ స్టారర్ మూవీ లో ఒక ప్రత్యేక పాత్రను చెయ్యమని కృష్ణవంశీ కోరాడట. కాని ఇప్పటికే తన వయసు 70 సంవత్సరాలు దాటిపోవడంతో పాటు వయోభారం రిత్యా కెమెరా ముందు కూడా నుంచుని డైలాగ్ లు చెప్పడం కష్టంగా ఉండడంతో తాను చరణ్ తో నటించాలని కోరిక ఉన్నా తనకు వయసు సహకరించడం లేదు అంటూ ఈ మల్టీ స్టారర్ సినిమా నుండి కృష్ణ తప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఈ సినిమా కధలో హీరో వెంకటేష్ కొన్ని మార్పులు సూచించాడని కూడా టాక్ ఉంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న వెంకటేష్ నటించిన ‘మసాలా’ మల్టీ స్టారర్ రిజల్ట్ బట్టి చరణ్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఉంటుంది అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: