తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుమన్ 1959, ఆగష్టు 28న జన్మించారు. సుమన్ తల్లి కేసరీ చందర్ మద్రాస్ యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. సుమన్ తండ్రి సుశీల్ చందర్ మద్రాస్ లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేశారు. దీంతో సుమన్ మద్రాస్ లో పెరిగారు. సుమన్ తన వృత్తి జీవితాన్ని కరాటే మాస్టర్ గా ప్రారంభించారు. తమిళ చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. తరంగిణి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. యాక్షన్ హీరోగా, రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చుకున్న సుమన్ నీలి చిత్రాల స్కాంలో చిక్కుకొని కొన్నాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ చిత్రం రంగంలో తనను తాను నిరూపించుకున్నారు. ఆ తరువాత సుమన్ అన్ని రకాల పాత్రలు పోషించిగల నటుడిగా పేరుతెచ్చుకున్నారు. అన్నమయ్య సినిమాలో శ్రీవేంకటేశ్వర స్వామిగా సుమన్ అభినయం అద్భుతం. శ్రీరామదాసు సినిమాలో శ్రీరాముడిగానూ సుమన్ అందరి మనసులు దోచుకున్నారు. శివాజీ సినిమాలో విలన్ గానూ సుమన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనేక పాత్రలతో మెప్పించిన సుమన్ ఇప్పటి వరకూ 150 సినిమాలకు పైగా నటించారు. సుమన్ తెలుగు, తమిళ, కన్నడం, హిందీ, ఇంగ్లీష్ బాషలను మాట్లాడగలరు. అంతేకాకుండా హెచ్.ఏ.ఎస్.శాస్ర్తి గారి సంస్కృతం నేర్చుకున్నారు. హైదరాబాద్ లో స్ధిర పడిన సుమన్ ప్రముఖ తెలుగు రచయిత డి.వి.నరసరాజు మనవరాలు శిరీషను వివాహం చేసుకున్నారు. సుమన్ సినిమా రంగంతో పాటు మన రాష్ట్ర్రంలో కరాటే అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: