డాషింగ్, డేరింగ్ హీరోగా పలు విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన శ్రీహరి ఆకస్మిక మరణం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.హైదరాబాదులోని బాలానగర్‌లో ఆగస్ట్ 15, 1964లో జన్మించిన శ్రీహరి "పృథ్వీ పుత్రుడు" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొత్తం 100 చిత్రాల్లో నటించగా 97 విడుదలయ్యాయి. మూడు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. రియల్ స్టార్‌గా పేరొందిన ఆయన "పోలీస్" చిత్రం మొదలుకొని 27 చిత్రాల్లో హీరోగా కనిపించారు. చివరిగా ఆయన నటించిన 'పోలీస్ గేమ్' చిత్రం నిర్మాణ దశలో ఉంది. 2005లో ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు అందుకున్నారు. అయోధ్య రామయ్య, విజయరామరాజు, భద్రాచలం, భైరవ, గణపతి, పృథ్వీనారాయణ వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల మన్ననలందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. బాలీవుడ్ చిత్రం 'జంజీర్' తెలుగు రీమేక్ చిత్రంలో 'తుఫాన్'‌లో ఆయన నటించారు.

స్టంట్స్, ఫైట్ మాస్టర్‌గా సినిమా కెరీర్ ప్రారంభిన శ్రీహరి సినీరంగానికే చెందిన నటి శాంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా, ఒక పాప (అక్షర) నాలుగు నెలల వయసులోనే మరణించడంతో ఆమె పేరిట 'అక్షర ఫౌండేషన్' పేరిట పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. మేడ్చల్‌లో నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని అక్షర ఫౌండేషన్ తరఫున మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీహరి, వచ్చే ఎన్నికల్లో కూకట్‌పల్లి శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతలోనే విధి ఆయన్ను కబళించింది. శ్రీహరి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: