పాత సినిమాలకు రంగులద్ది, డీటీఎస్ లోకి మార్చి కొత్త తరాలకు పరిచయం చేశారంటే ఓ అందం ఉంది. కానీ అప్పటి సినిమాలను మళ్లీ తిప్పి తీయాల్సిన పనేమొచ్చింది! అసలు అంత అవసరమేముంది! 
ఈ మధ్య మనవాళ్లందరికీ ఓ విచిత్రమైన పిచ్చి పట్టుకుంది. ఊ అంటే చాలు... ఫలానా సినిమాని రీమేక్ చేస్తున్నాం అంటూ కథ మొదలెడుతున్నారు. ఇక నట వారసులైతే ఇందుకు కంకణం కట్టుకుని కూచున్నారు. ఆ మధ్య హలోబ్రదర్ రీమేక్ లో నటించాలని నాగచైతన్య ఉవ్విళ్లూరారు. కానీ నాగ్ అడ్డుకోవడంతో ఆ సినిమా బతికిపోయింది. దానవీరసూరకర్ణ రీమేక్ లో నటించాలని ఉందని ఎన్టీయార్ చాలాసార్లు చెబుతుంటాడు. గుండమ్మ కథ చిత్రాన్ని రీమేక్ చేయాలని చాలామంది దర్శకులు తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు. రామ్ చరణేమో గ్యాంగ్ లీడర్ ని రీమేక్ చేస్తే నటించేస్తానంటున్నాడు.

ఇప్పుడు విష్ణు ఇదే పాట మొదలెట్టాడు. అయితే ఇతడి కోరిక మరీ విచిత్రం. మొన్నటి వరకూ వాళ్ల నాన్న సినిమా అసెంబ్లీ రౌడీని తీస్తానని అన్నవాడు, ఇప్పుడు ఏకంగా జగదేక వీరుడు అతిలోక సుందరి తీస్తానంటున్నాడు. చిరంజీవి సినిమాని ఈయన రీమేక్ చేయడమేంటో, అందులో ఈయనగారు నటించమేంటో ఖర్మ. కొందరైతే సాగర సంగమం లాంటి సినిమాలు కూడా గురి పెట్టేశారు. ఇది మరీ కంగారు పెడుతోంది సినీ ప్రియులను.

అయినా వీళ్లంతా ఎందుకు అప్పటి సినిమాల జోలికి పోతున్నారో అర్థం కావడం లేదు. ఈ జెనరేషన్ కు తగ్గ కథలు రాయించుకుని, వాటితో ప్రయోగాలు చేసుకోవచ్చు కదా.

గుండమ్మ కథలో సూర్యకాంతం పాత్ర ఎవరితో చేయించాలో ఇప్పటికి అర్థం కావడం లేదు జనాలకు. ఎవరో ఒకరిని పెట్టేసి, ఏదేదో మార్చి తీసేయడం అంత అవసరమా! దానివల్ల ఆణిముత్యాల్లాంటి నాటి సినిమాల పరువు పోవడం తప్ప కలిసొచ్చేదేమైనా ఉందా! ఆ మధ్య మరోచరిత్ర తీశారు. ఏమైందో తెలుసుగా. చూడలేక కన్నీళ్లు పెట్టుకున్నారు జనం. జంఝీర్ రీమేక్ లో నటించి రామ్ చరణ్ ఎంత దెబ్బ తిన్నాడో చూశాం కదా. రామ్ గోపాల్ వర్మ లాంటోడే ఆగ్ సినిమాను రీమేక్ చేసి తప్పు చేశానని ఇప్పటికీ కుమిలిపోతున్నాడు. మరి ఈ కుర్రాళ్లకెందుకో ఈ వల్లమాలిన తపన. దయచేసి వాటికి జోలికి పోకండి బాబూ. మనవి అని చెప్పుకోదగ్గ కాసిన్ని సినిమాలనూ పాడు చేసి తెలుగు సినిమా పరువు తీయకండి ప్లీజ్!



మరింత సమాచారం తెలుసుకోండి: