పదహారేళ్ల వయసులోనూ యాభై ఆరేళ్ల వయసులోనూ కూడా ఒకలానే ఫీలవుతుంటారు కొందరు. మాకేం తక్కువ, అప్పుడు చేసింది ఇప్పుడు ఎందుకు చేయలేం, అప్పుడు చూసినవాళ్లు ఇప్పుడెందుకు చూడరు అంటూ ఓవర్ కాన్ఫిడెన్సును ప్రదర్శిస్తుంటారు. కానీ వెంకటేష్ అలా అనే టైపు కాదని తెలుస్తోంది. ఎందుకంటే... అతడు తన వయసును దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నాడు.

ఇటీవల ఓ దర్శకుడు వెంకీకి కథ చెప్పడానికి వెళ్లాడట. కథ విన్న తరువాత నేను చేయలేను అన్నాడట వెంకీ. కథ నచ్చలేదేమో అని ఆ డైరెక్టర్ అనుకున్నాడట కానీ ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదట. అయితే నిజానికి వెంకీ నో అన్నది కథ గురించి కాదు, సోలో హీరోగా సినిమాలు చేయడం ఇష్టం లేక అంటున్నారు కొందరు. కొంతమంది డైరెక్టర్లకయితే సోలో హీరో కథలు చెప్పొద్దు అని కూడా చెప్పేశాడని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలీదు కానీ... వెంకీ వేస్తున్న అడుగులు చూస్తుంటే నిజమేనని నమ్మాల్సి వస్తోంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాంచి హిట్టయ్యింది. ఆ తరువాత వెంకీ కావాలంటే అతడితో సినిమాలు చేసేవాళ్లు ఉన్నారు. కానీ అతడు చేయడానికి ఇష్టపడలేదు. గ్యాప్ తర్వాత రామ్ తో కలిసి మసాలా చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ తరువాత రామ్ చరణ్ తో కృష్ణవంశీ చిత్రానికి ఎస్ అన్నాడు. దీన్ని బట్టి అతడు మల్టీ స్టారర్ చిత్రాలు తప్ప సోలో హీరోగా చేయడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. బహుశా షాడో ఫలితాలు చూశాక రిస్క్ తీసుకోవడం అనవసరం అనుకున్నాడేమో మరి. తన వయసును, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అతడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకుని తీరాలి. గ్లామర్ పోయి, మార్కెట్ పడిపోయినా అనవసరమైన ప్రయోగాలు చేసి నిర్మాత కొంపముంచే హీరోలంతా వెంకీని చూసి నేర్చుకోవాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: