ఇండస్ర్టీలో రోజూ బోలెడన్ని జరుగుతూ ఉంటాయి. వాటి గురించి నిజాలు కొన్ని, పుకార్లు కొన్ని హల్ చల్ చేస్తుంటాయి. పరిస్థితి ఎలా అయిపోతుందంటే... ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాదు. సదరు వ్యక్తులేమో చెప్పరు. దాంతో ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు పెద్ద పజిల్ లా తయారవుతున్నాయి.

టాలీవుడ్లో ఎప్పుడూ హాట్ గా వినిపించే ప్రేమకథ రానా, త్రిషలది. పార్టీలు, ఫంక్షన్లలో ఇద్దరూ కలిసే కనిపిస్తారు. ఇటీవల గోవా బీచ్ లో కూడా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అలాగని అడిగామే అనుకోండి... మా మధ్య ఏం లేదంటారు. వీళ్లు ప్రేమలో ఉన్నారా, పెళ్లి చేసుకుంటారా అన్న విషయాల్లో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇలాంటి జంటే బాలీవుడ్లోనూ ఉన్నారు. రణబీర్ కపూర్, కత్రినాలు. వాళ్లు కూడా అంతే. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కనిపిస్తుంటారు. ప్రపంచమంతా వాళ్లిద్దరూ లవర్స్ అని ఫిక్సయిపోయింది. వాళ్లు కూడా ఒకరి గురించి ఒకరు అందంగా చెబుతుంటారు. పెళ్లి గురించి అడిగితే మాత్రం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనేలు కూడా అంతే. ఒకళ్లు లేకుండా ఒకళ్లు ఉండరు. కానీ అనామకులమన్నంత బిల్డప్ ఇస్తారు. వరుణ్ ధావన్-ఆలియా భట్ ల ప్రేమది కూడా ఇదే పరిస్థితి.

ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమిస్తే ధైర్యంగా చెప్పాలి. లేదంటూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఓ పక్క ఇష్టమొచ్చినట్టు తిరిగేస్తారు. అందరి కళ్లలోనూ పడిపోతారు. కానీ ఏమీ లేదంటూ మసిపూసి మారేడు కాయ చేస్తుంటారు. మరీ అడిగితే పర్సనల్ విషయాల్లో వేలు పెట్టొద్దంటారు. సెలెబ్రిటీలంటే జనానికి ఆసక్తి ఉంటుందని తెలిసి కూడా ఎందుకిలా చేయాలి, ఎందుకు తిరిగి అడిగినవాళ్లనే అదిలించాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: