మన నటీమణులందరి వైవాహిక బంధాలూ కోర్టు మెట్ల దగ్గర ముగుస్తున్నాయెందుకో. గతంలో కూడా విడిపోవడాలు జరిగాయి గానీ... ఇప్పుడు వాటి సంఖ్య మరీ ఎక్కువయ్యింది. చాలామంది తారల పెళ్లి కథలు కోర్టు కంచెకు చేరుతున్నాయి. మొన్నామధ్య మమతా మోహన్ దాస్ విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. చిన్ననాటి స్నేహితుడిని ఎంతో ఇష్టంగా పెళ్లాడిన ఆమె, పారాణి ఆరకముందే అతడి నుంచి పారిపోయింది. అతడు పెట్టే కష్టాలు తట్టుకోలేక నన్ను కాపాడమంటూ కోర్టుకెళ్లింది. విడాకులు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం రంభ కూడా విడాకులు తీసుకుంటోందన్న వార్తలు వచ్చాయి. ఆమె రీ ఎంట్రీ నేపథ్యంలో ఆరా తీసిన వాళ్లకి ఈ విషయం తెలియడంతో... అంతవరకూ గుట్టుగా దాచిన విషయం గుప్పుమంది. ఇవి ఇంకా మరుగున పడకముందే అలనాటి హీరోయిన్ సరిత విడాకుల కోసం కోర్టుకెళ్లింది. వైవిధ్యభరితమైన నటిగా, విలక్షణమైన డబ్బింగ్ ఆర్టిస్టుగా సరితకు చాలా పేరుంది. ముఖేశ్ కుమార్ ను పెళ్లి చేసుకున్నాక కూడా నటించింది కానీ... నటన కంటే డబ్బింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. అప్పుడప్పుడూ నటిస్తోంది. అయితే రెండేళ్లుగా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దానికి కారణం... ఆమె దుబాయ్ లో ఉంటోంది. అక్కడ ఆమె కొడుకు మెడిసిన్ చదువుతున్నాడు. అతడికి తోడుగా సరిత అక్కడే ఉంటోందట. అయితే ఇటీవలే ఆమెకు ఇండియాలో ఉన్న తన భర్త మరో పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందట. దాంతో వచ్చి ఆరా తీస్తే... అది నిజమేనని తెలిసింది. దాంతో కడుపుమండి కోర్టుకెళ్లింది. భర్త చేసిన అన్యాయాన్ని సరిచేసి, తనకు న్యాయం చేయమంటూ అర్థించింది. విడాకులు కోరింది. ఇలా సీనియర్లూ, జూనియర్లూ కూడా విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కెరీర్లో సక్సెస్ అయినా పర్సనల్ లైఫ్ లో వారు ఫెయిలవడం నిజంగా దురదృష్టం!  

మరింత సమాచారం తెలుసుకోండి: