ఆనంది... సీరియల్స్ పిచ్చిగా చూసేవాళ్లెవరినైనా అడిగితే ఈ పేరును ఇట్టే గుర్తు పట్టేస్తారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో హీరోయిన్ పేరు ఆనంది. ఆ చిట్టి పెళ్లికూతురు ఇప్పుడు పెద్దదైపోయింది. హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. బామ్మగారూ అంటూ చిన్నారి పెళ్లికూతురులో ముద్దుముద్దుగా మాట్లాడిన ఆ బాలనటి... అవికా గోర్. పెద్దదయిన ఆనందిగా వేరే అమ్మాయి నటించినా, ఇప్పటికీ ఆ సీరియల్ ని గుర్తు తెచ్చుకోగానే అవికానే కళ్లముందు కనిపిస్తుంది. అంత అద్భుతంగా పండించింది ఆ పాత్రని. చూస్తూండగానే ఎదిగిపోయింది అవికా. కలర్స్ చానల్లో ప్రసారమవుతోన్న ససురాల్ సిమర్ కా సీరియల్ లో హీరోయిన్ గా ప్రత్యక్షమయ్యింది.  ఓ రెండు మూడు హిందీ సినిమాల్లో నటించింది. తొలిసారిగా టాలీవుడ్లో అడుగుపెడుతోంది నాగార్జున నిర్మిస్తోన్న ఉయ్యాల జంపాల చిత్రంలో హీరోయిన్ అవికా గోరే. ఇప్పటికే ఆ చిత్ర ట్రెయిలర్లు అందరినీ ఆకట్టుకుంటున్నారు.అవికా కూడా ఎంతో ఒద్దికగా, అందంగా కనిపిస్తోంది. అయితే నిజానికి అవికాకి వెంకటేష్ అంటే చాలా ఇష్టం. గతంలో ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు... తనకు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని, చాన్స్ దొరికితే వెంకీ పక్కన నటిస్తానని చెప్పింది. ఈ వయసులో వెంకీ పక్కన ఈ పిల్ల సూటయ్యే చాన్సే లేదు. కానీ నాగ్ చేతిలో పడి... యంగ్ హీరో పక్కన చాన్స్ కొట్టేసింది కదా. ముందు ముందు ఇంకెన్ని అవకాశాలు సంపాదిస్తుందో చూద్దాం!  

మరింత సమాచారం తెలుసుకోండి: