రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె... బాలీవుడ్ జనాలకు ఈ పేర్లు బాగా సుపరిచితం. ఫ్లేవర్స్, షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గాన్ వంటి విభిన్నమైన సినిమాల్ని రూపొందించి బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిందీ దర్శక ద్వయం. గో గోవా గాన్ సినిమా హీరో సైఫ్ అలీ ఖాన్ తోనే ప్రస్తుతం ‘హ్యాపీ ఎండింగ్’ అనే సినిమా చేస్తోందీ జంట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇందులో ఇలియానా హీరోయిన్. రాజ్, కృష్ణ తెలుగువారే అన్న సంగతి తెలిసింది కొద్దిమందికే. చిత్తూరు జిల్లాకు చెందిన వీరిద్దరూ విదేశాల్లో చదువుకుని తర్వాత బాలీవుడ్ లో దర్శకులుగా పరిచయమయ్యారు. అక్కడ పేరు తెచ్చుకున్నాక వీరి దృష్టి టాలీవుడ్ పై పడింది. ముందుగా నిర్మాతలుగా అవతారమెత్తి ‘డి ఫర్ దోపిడీ’ సినిమాను నిర్మించారు. సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమాకు మరో హీరో నాని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుండగా రాజ్, కృష్ణ దర్శకులుగానూ టాలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మహేష్ బాబు హీరోగా రాజ్, కృష్ణల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అశ్వనీదత్ సన్నాహాలు చేస్తున్నారు. కథ విని మహేష్ కూడా తన అంగీకారం తెలిపారట. ప్రస్తుతం మహేష్.. శ్రీను వైట్లతో ‘ఆగడు’ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక కొరటాల శివతో సినిమా అనుకుంటున్నాడు కానీ.. దాని కంటే ముందే రాజ్, కృష్ణలతో సినిమా మొదలవుతుందని అంటున్నారు. కారణం.. కొరటాల శివ కూడా ఎన్టీఆర్ తో సినిమాకు కమిటవ్వడమే. మొత్తానికి రాజ్, కృష్ణ టాలీవుడ్ అరంగేట్రానికి మంచి హీరో, నిర్మాతనే ఎంచుకున్నారు. ఇప్పటికే రచ్చ గెలిచి వచ్చిన ఈ దర్శక ద్వయం ఇంట గెలుస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: