విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా క్రిష్-3 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారత బాక్సాఫీసు చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రానికి వసూళ్లు వస్తున్నాయి. నవంబరు 1న విడుదలైన ఈ చిత్రం రోజు రూ.25 కోట్ల చొప్పున నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. ఇండియాలో ఇంత వేగంగా వంద కోట్ల మార్కును మరే చిత్రమూ అందుకోలేదు. క్రిష్-3 జోరు చూస్తుంటే భారత చలనచిత్ర రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కోయీ మిల్ గయా, క్రిష్ చిత్రాలకు కొనసాగింపుగా వచ్చిన సినిమా క్రిష్-3. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన రాకేష్ రోషనే ఈ సినిమాను కూడా రూపొందించాడు. ఆయనే నిర్మాత కూడా. క్రిష్ లో హృతిక్ సరసన నటించిన ప్రియాంక చోప్రా ఈ సినిమాలోనూ కథానాయికగా నటించగా.. కంగనా రనౌత్ కీలకమైన ప్రతినాయిక పాత్రలో నటించింది. మరో హీరో వివేక్ ఒబెరాయ్ ఇందులో విలన్ గా నటించడం విశేషం. స్పైడర్ మేన్ తరహాలో హృతిక్ చేసిన విన్యాసాలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యువ ప్రేక్షకులు కూడా సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో రూపొందిన గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాగా మూణ్నెల్ల క్రితం వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ దే కలెక్షన్ల విషయంలో రికార్డు. ఆ సినిమాకు కూడా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. దాదాపు రూ.400 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు క్రిష్-3 కూడా మిశ్రమ స్పందనతోనే ఎక్స్ ప్రెస్ ను దాటే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రెండు వారాలు ఇదే జోరు కొనసాగిస్తే చెన్నై ఎక్స్ ప్రెస్ ను దాటేసి నెంబర్ వన్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: