ఈ మధ్య దర్శకులకి హీరోయిన్లను వెతుక్కోవడమే పెద్ద పనైపోయింది. ఎంతసేపని కాజల్, తమన్నా, సమంతాల ముఖాలనే చూస్తారు! అందుకే కొత్త భామల కోసం వేటాడుతున్నారు. అంత టైమ్ లేనివాళ్లు బాలీవుడ్ మీద పడుతున్నారు. ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడి కూడా అదే పనిలో ఉన్నాడు. త్వరలో తాను తీయనున్న చిత్రంలో రానా సరసన నటించే పోరి కోసం భూతద్దం వేసి వెతుకుతున్నాడు. అతడి లిస్టులో ముగ్గురు ముద్దుగుమ్మలు ఉన్నారని తెలుస్తోంది. ఆ ముగ్గురూ... పరిణీతి చోప్రా, నర్గీస్ ఫక్రి, శ్రద్ధాకపూర్. ఇషక్ జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రాలతో సక్సెస్ బాటలో నడుస్తోంది పరిణీతి. రాక్ ఆన్, మద్రాస్ కేఫ్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అందరినీ బుట్టలో వేసేసింది నర్గీస్ ఫక్రి. ఆషిఖీ 2 చిత్రంతో తన టాలెంట్ ఏమిటో చూపించింది శ్రద్ధాకపూర్. ముగ్గురూ మంచి హీరోయిన్లే. మరి డైరెక్టర్ సాబ్ ఎవరికి ఓటేస్తాడన్నది చూడాలి. అయితే పరిణీతిని తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఓసారి మాట్లాడుతూ... తనకు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందంటూ ఆసక్తిని వెలిబుచ్చింది. కాబట్టి ఆమెను ఒప్పించడం ఈజీ అన్న ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. చూద్దాం ఏం జరుగుతుందో... రానా సరసన ఏ సుందరాంగి చేరుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: