ఎంతమంది కమెడియన్లయినా రానీయండి... బ్రహ్మానందం స్థానాన్ని మాత్రం కదల్చలేరు. ఆనాటి నుంచి నేటి వరకూ అదే హాస్యం. ఎక్కడా బోరు కొట్టనీయడు. ఎప్పుడూ తన నటనాస్థాయిని తగ్గించడు. హీరోలతో సమానంగా సినిమాని నడిపించేస్తాడు. అందుకే అతడు ఇప్పటికీ నంబర్ వన్ కమెడియనే. అయితే ఉన్నట్టుండి బ్రహ్మీకి బాలీవుడ్ మీదకి మనసు పోయింది. ఇటీవలే ఓ హిందీ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అప్పట్నుంచీ... అది ఏం సినిమా, అందులో బ్రహ్మానందం పాత్ర ఎలా ఉంటుంది, ఆయన హిందీలో డైలాగ్ చెప్పగలడా, లేదంటే డబ్బింగ్ ఎవరు చెబుతారు అంటూ ఒకటే చర్చ. వీటన్నిటికీ సమాధానాలు రెడీ అయ్యాయి. వెల్ కమ్ చిత్రానికి సీక్వెల్ అయిన వెల్ కమ్ బ్యాక్ చిత్రంలో నటించనున్నాడు బ్రహ్మానందం. అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో బ్రహ్మీది చాలా డిఫరెంట్ పాత్ర అట. అసలు అతడికి డైలాగులే ఉండవట. కేవలం హావభావాలతోనే నవ్విస్తాడట. గతంలో వినోదం సినిమాలో చేశాడు చూడండి... అలాంటి రోల్ అన్నమాట. కాబట్టి డబ్బింగ్ టెన్షన్ కూడా లేదు మనోడికి. అయినా బ్రహ్మీకి ప్రయోగాలు కొత్తేమీ కాదు కదా! ఓ పక్క కమెడియన్ గా దున్నేస్తూనే హీరోగా నటించాడు. నవ్వులతో పొట్ట చెక్క చెక్కలు చేసే అతడు, బాబాయ్ హోటల్ సినిమాలో తన నటనతో కంటతడి పెట్టించాడు. ఖాన్ దాదా అంటూ కామెడీ విలన్ గా చేశాడు. ఏది చేసినా తన స్టయిల్లో చేయడం, అందరితో శభాష్ అనిపించుకోవడం బ్రహ్మీకి అలవాటు. బాలీవుడ్లో కూడా కచ్చితంగా అదే చేస్తాడు. శభాష్ అనిపించుకునే వస్తాడు. ఆల్ ద బెస్ట్ బ్రహ్మీ!  

మరింత సమాచారం తెలుసుకోండి: