దర్శక నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టే హీరోయిన్ల గురించి ఈ మధ్య బాగానే వింటున్నాం. డేట్స్ దగ్గర్నుంచి ప్రమోషన్ కార్యక్రమాల వరకూ ముద్దుగుమ్మలు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అయితే అందరూ అలా కాదు. నిబద్దతతో పనిచేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారందరిలో అనుష్క స్పెషల్. అనుష్క ఏమిటి, ఆమె పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆమెతో పని చేసినవాళ్లెవరిని అడిగినా తెలిసిపోతుంది. కానీ ఆమె ఎంత రిస్క్ చేస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం వర్ణ టీమ్ ని అడగారు. వాళ్లంతా అనుష్కని, ఆమె ఆత్మవిశ్వాసాన్ని అలుపు లేకుండా పొగిడేస్తున్నారు. వర్ణ చిత్రంలో రెండు రకాల పాత్రలను చేస్తోంది బొమ్మాళి. వాటిలో ఒకటి పోరాట యోధురాలి పాత్ర. దానికోసం భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. వాటిని జార్జియా దేశంలో తీశారు. అక్కడ చలి మైనస్ డిగ్రీల్లో ఉంటుందట. పైగా డెబ్భై రోజుల ఏకధాటి షెడ్యూల్. పరాయి దేశం కావడంతో వసతులు కూడా సరిగ్గా లేవట. అయినా కూడా అనుష్క ఏమాత్రం విసుక్కునేది కాదట. అలసటను చూపించేది కాదట. భారీ సన్నివేశాల కోసం గంటల తరబడి కసరత్తులు చేసేదట. అంత కష్టపడుతున్నా చిరునవ్వు చెదిరేది కాదట. అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేదట. ఇలా కదిపితే చాలు... వంతులు వేసుకుని మరీ అరుంధతిని పొగిడేస్తున్నారు ఆ చిత్ర యూనిట్. అంత కమిట్ మెంట్ ఉండటం వల్లే అనుష్క ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఉంది. హీరోలతో సమానమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. హ్యాట్సాఫ్ బొమ్మాళీ!  

మరింత సమాచారం తెలుసుకోండి: