ఒకప్పుడు టాలీవుడ్లో కథలు లేవన్నారు. మంచి కథలే దొరకడం లేదు అంటూ నెలల తరబడి కథల కోసం వేటాడేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్ల కోసం వేటాడుతున్నారు. ఏమయ్యిందో ఏమోగానీ, గత కొంతకాలంగా టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఏర్పడింది.   గబ్బర్ సింగ్ 2 చిత్రానికి హీరోయిన్ దొరక్క దర్శకుడు సంపత్ నంది తంటాలు పడుతున్నాడు. దీపికా పదుకొనే నుంచి ప్రణీత వరకూ అందరి పేర్లూ వినిపిస్తున్నాయి కానీ ఎవరూ ఓకే కావడం లేదు. తాజాగా వాణీ కపూర్ పేరు వినిపిస్తోంది. అయితే ఆమె నానితో సినిమా చేస్తోంది. అది పూర్తయ్యేవరకూ వేరేది కమిటవ్వకూడదని బాండ్ రాసింది. ఇక గబ్బర్ సింగ్ కి ఎలా ఓకే చెబుతుంది అన్నది సందేహం. బాలయ్య కోసం అమ్మాయిలను వేటాడి వేటాడి చివరకు ఎవరూ దొరక్క ఇద్దరు ఫ్లాప్ హీరోయిన్లతో సరిపెట్టుకున్నాడు బోయపాటి. చివరకు రాజమౌళికి కూడా త్వరగా హీరోయిన్ సెట్ కాలేదు. మొన్నటి వరకూ బాహుబలి చిత్రంలో రానాకి తగిన జోడీ కోసం వెతుకుతూనే ఉన్నాడు. ప్రభాస్ కి అనుష్కని ఠక్కున తీసేసుకున్నాడు. కానీ రానాకి అమ్మాయిని వెతకడానికి కాస్త టైమ్ పట్టింది. ప్రణీత పేరు వినిపించింది కానీ ఆమెను తీసుకోలేదని తరువాత తెలిసింది. చివరికి లావణ్య త్రిపాఠీ ఆ చాన్సును కొట్టేసింది. అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది లావణ్య. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా సుతిమెత్తని లావణ్య సోయగాలు అందరి కళ్లలోనూ అలానే ఉండిపోయాయి. దూసుకెళ్తా సినిమాలో విష్ణు పక్కన చేసింది లావణ్య. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు కానీ లావణ్య మాత్రం అందరికీ నచ్చేసింది. ఆమెను మెచ్చినవారిలో రాజమౌళి కూడా ఉండటంతో అతడి సినిమాలో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది లావణ్య. రాజమౌళి సినిమాలో హీరోయిన్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక లావణ్య స్టార్ తిరిగినట్టే!

మరింత సమాచారం తెలుసుకోండి: