ఏ కార్యక్రమానికైనా సెలెబ్రిటీ అనేవాళ్లెవరైనా వస్తే ఆ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది జనానికి. అందులోనూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలైతే సెలెబ్రిటీలు రావడం మరీ మంచిది. ఎందుకంటే, జనం సెలెబ్రిటీలను చాలా విషయాల్లో గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. కాబట్టి వాళ్లకు మంచి చెప్పడానికి, నేర్పడానికి సెలెబ్రిటీలే కరెక్ట్. ఓ మంచి కారణం కోసం ఏదైనా కార్యక్రమం చేపడితే, చాలామంది సెలెబ్రిటీలో అందులో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే అందరిలోకీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిగతా వారిలా కాకుండా వెంకీ చాలా పనులు తెలియకుండా చేస్తాడని అంటారు. తాను చేసేదానికి పబ్లిసిటీని కోరుకోకపోవడం వల్ల అవి ఎవరికీ తెలియవట. తెలియకూడదనేదే అతడి అభిమతం కూడానని, అతడి ఆలోచన గొప్పదని వెంకీ ఫ్యాన్స్ చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా వెంకీ సామాజికాంశానికి చెందిన ఓ వీడియోలో నటించాడు. దీన్ని పోలీస్ డిపార్ట్ మెంట్ రూపొందించింది. ఈ మధ్య ఫేక్ పోలీసులు ఎక్కువవుతున్నారు. అవీ ఇవీ చెప్పి జనాలను మోసం చేస్తున్నారు. ఇలాంటివారిని ఎలా గుర్తించాలి, వారి మోసాలకు బలవకుండా తమను తాము ఎలా కాపాడుకోవాలి వంటి విషయాల్లో ప్రజలను అప్రమత్తం చేయడమే దీని ఉద్దేశం. ఇందులో నటించమని అడగ్గానే వెంకీ ఎస్ చెప్పాడట. అందుకోసం పోలీసు డిపార్ట్ మెంటు వారు వెంకీకి థ్యాంక్స్ చెబుతున్నారు. వెంకీ అనే కాదు... ఇలాంటివి అందరూ చేయాలి. చిన్నోడా పెద్దోడా అన్నది అనవసరం. ఎవరైనా సెలెబ్రిటీ సెలెబ్రిటీనే. ఎవరి స్థాయికి తగ్గ పనులు వాళ్లు చేయవచ్చు. ఏ సంబంధం లేకపోయినా తమను ఎంతో అభిమానించి... తమ పేరుతో అన్నదానాలు, రక్తదానాలు కూడా చేసే అభిమానుల కోసం ఆమాత్రం చేయకపోతే ఎలా?

మరింత సమాచారం తెలుసుకోండి: