పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా... శ్రీదేవి ప్రేక్షకుల మనసులకు మాత్రం దూరం కాలేదు. ఆమె గురించి ప్రతి చిన్న విషయమూ వార్తే. ఆమె చేసిన ఏ పనయినా విశేషమే. ఇక రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ సందడి మరీ ఎక్కువయ్యింది. ఆమె ఏం చేస్తుందా అని ఆరాలు తీయడం, ఆమె గురించి ఏదో ఒక విషయం తెలియడం, దాని గురించి అందరూ చర్చించడం మామూలయిపోయింది. రీసెంట్ గా శ్రీదేవి గురించి ఓ విషయం తెలిసింది. శ్రీదేవి బోనీ కపూర్ తో ప్రేమలో పడకముందు ఓ తమాషా జరిగిందట. అప్పటికి అతడు నిర్మాత. శ్రీదేవి స్టార్ హీరోయిన్. ఇద్దరికీ మంచి పరిచయం ఉంది కానీ స్నేహం కానీ, ప్రేమ కానీ లేవు. దాంతో ఓసారి రాఖీ పండక్కి శ్రీదేవి బోనీకపూర్ కి రాఖీ కడదామని అనుకుందట. ఏవో ఆటంకాలు వచ్చి కట్టలేకపోయిందట. ఆ తర్వాత అతడు తనను ప్రేమిస్తున్నాడని తెలియడం, అతడి ప్రేమను ఆమె కూడా అంగీకరించడం జరిగిందట. ఈ విషయం తెలిసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇక పోతే శ్రీదేవి తరువాతి సినిమా గురించి కూడా పెద్ద చర్చే జరుగుతోంది. ఇంగ్లిష్ వింగ్లిష్ తరువాత ఆమె ఇంతవరకూ ఏ సినిమా చేయలేదు. కమల్ తో చేస్తోందని, రజనీతో చేయనుందని, హాలీవుడ్ మూవీకి రెడీ అవుతోందని, తెలుగులో కోన వెంకట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని... ఇలా వార్తల మీద వార్తలు వస్తున్నాయే తప్ప ఆమె మళ్లీ మేకప్ వేసింది లేదు. అసలు ఆమె ప్లాన్ ఏమిటో, ఏం చేయాలనుకుంటోందో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే శ్రీదేవి ప్రస్తుతం తన గురించి కాకుండా తన కూతురి ఎంట్రీ గురించి ఆలోచిస్తోందని వినికిడి. జాహ్నవిని అప్పుడే సినిమాల్లోకి పంపం అంటూ చెప్పినా, వెనుక ఆమె ఎంట్రీకి సీక్రెట్ ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. ఆమెని సల్మాన్ చేతిలో పెట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా ఆమెకు సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: