కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా కాలం కలసి రాదు. ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ గాడిన పడదు. దానికి నిలువెత్తు నిదర్శనం పూర్ణ. ఈ చిన్నదానికి కావలసినంత ప్రతిభ ఉంది. కానీ అది ఆమెను ఇంతవరకూ సెటిల్ చేయలేకపోయింది. సీమ టపాకాయ్ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. ధనవంతులను అసహ్యించుకునే అమ్మాయిగా, మంచి మనసున్నదానిగా చక్కగా నటించింది. అయినా ఆ తరువాత అంతగా అవకాశాలు రాలేదు. కానీ ఆమె టాలెంటును గమనించిన రవిబాబు 'అవును' సినిమాలో చాన్స్ ఇచ్చాడు. అందులో అయితే ఇరగదీసేసింది పూర్ణ. కనిపించని దెయ్యం తనను వేధిస్తుంటే ఆమె చూపిన హావభావాలకు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. అయినా కూడా ఆమె ఫేట్ మారలేదు. ఇప్పటికీ తగిన గుర్తింపు కోసం తహతహలాడుతూనే ఉంది పూర్ణ. అయితే ఆమెకు మంచి రోజులు వచ్చాయేమో అనిపిస్తోందిప్పుడు. ఎందుకంటే... ఓ పెద్ద బ్యానర్లో అవకాశం కొట్టేసింది పూర్ణ. కరుణానిధి మనవడు అరుల్ నిధి హీరోగా చేయనున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది పూర్ణ. మధురై అమ్మాయిగా సంప్రదాయబద్దమైన పాత్రలో కనిపించబోతోంది. కరుణానిధి మనవడంటే ఎంత ప్రతిష్టాత్మకంగా సినిమాని తీస్తారో చెప్పాల్సిన పని లేదు. అలాంటి సినిమాలో చేయడమంటే చాలా మంచి అవకాశం. అందుకే ఈసారి తనకు బ్రేక్ వచ్చి తీరుతుందని నమ్ముతోంది పూర్ణ. అలాగే సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోన్న సుధీర్ బాబు సరసన 'ఆడు మగాడ్రా బుజ్జి' కూడా చేస్తోంది పూర్ణ. ఇది కూడా విజయం సాధిస్తే తెలుగులోనూ తనకు మంచి చాన్సులొస్తాయని కలలు గంటోంది. ఇలాంటి టాలెంటెడ్ నటికి ఇప్పటికైనా బ్రేక్ వస్తే బాగుణ్ను పాపం!

మరింత సమాచారం తెలుసుకోండి: