సైఫ్ ఎక్కడుంటే వివాదాలు అక్కడుంటాయి. ముక్కుమీద కోపం ఇతగాడికి. ఎవరైనా కాస్త ఆ ముక్కును గోకారో... చచ్చారే. అతడి జోలికి పోయి మీడియా వాళ్లు చాలా సార్లు బుర్ర బొప్పి కట్టించుకున్నారు. ఇంట్లో వాళ్లు సైతం సైఫ్ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటారు. అలాంటి ఖాన్ సాబ్ లో కాస్త మెతకదనం కూడా ఉందండోయ్. ఓ విషయంలో అనుమతినివ్వలేదని ఎయిర్ పోర్ట్ అధికారులతో తగేవేసుకున్నాడు సైఫ్. తనకు నచ్చని ప్రశ్న అడిగారని మీడియా వాళ్ల మీద విరుచుకుపడ్డాడోసారి. ఇంకోసారి చేయి కూడా చేసుకున్నాడు. ఇతడి దుందుడుకు స్వభావం గురించి అందరికీ తెలిసిపోవడంతో అతడి జోలికి వెళ్లడం మానేశారంతా. చివరకు కరీనా తల్లిదండ్రులు కూడా ఆ ముక్కోపికి కూతురిని ఇవ్వడానికి కంగారు పడ్డారు. అంతగా తన కోపంతో, కఠినత్వంలో ఫేమస్ అయ్యాడు హీరో. అయితే కొన్ని విషయాల్లో తాను చాలా సెంటిమెంటర్ గా సెన్సిటివ్ గా ఉంటానని, అందరూ అనుకునేంత కఠినుడినేమీ కాదని వివరణ ఇస్తున్నాడు సైఫ్. అందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. సైఫ్ ఎప్పుడూ సినిమాలు చూడడట. షాకింగ్ గా ఉంది కదూ! కానీ ఇది నిజం. సినిమాలు చేస్తాడు తప్ప వాటిని చూడటానికి ఇష్టపడడట. ఎందుకంటే... చిన్నప్పుడోసారి ఓ సినిమా చూశాడట. అందులో అతగాడి తల్లి షర్మిటా ఠాగూర్ హీరోయిన్. ఆమె సినిమాలో విపరీతంగా ఏడుస్తుందట. అది చూసి సైఫ్ మనసు అల్లాడిపోయిందట. ఇంకోసారి తాను సినిమా చూడకూడదని డిసైడ్ చేసుకున్నాడట. అయితే ఇప్పుడు, ఇన్నాళ్లకి, కరీనా పుణ్యమా అని మళ్లీ సరదాగా సినిమాలు చూడ్డానికి అలవాటు పడుతున్నాడు సైఫ్ ఖాన్. ఏదేమైనా తల్లి కన్నీళ్లు చూడలేక సినిమాలే మానుకున్నాడంటే, అతడెంత సున్నిత మనస్కుడో అర్థమవుతోంది. మరి అంత మంచి మనసున్నవాడు తిక్కతిక్కగా ప్రవర్తించి తిట్లు ఎందుకు తింటాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: